మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన! | - | Sakshi
Sakshi News home page

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన!

Jul 5 2025 6:00 AM | Updated on Jul 5 2025 6:00 AM

మేఘం

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన!

మార్కాపురంపై ఇటీవల కమ్ముకున్న మేఘాలు

మార్కాపురం:

రీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జూన్‌ మొదటి వారం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. నైరుతి రుతు పవనాలు ముందుగా వచ్చినప్పటికీ జూన్‌ రెండో వారం నుంచి సరైన వర్షాలు కురవలేదు. జూన్‌ మాసంలో జిల్లా సాధారణ వర్షపాతం 43.75 మిల్లీమీటర్లు కాగా 40.9 మి.మీ కురిసినట్లు ఐఎండీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం వర్షం జాడ లేక పొలాలు పదునెక్కలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పొలాలను దుక్కి దున్నిన రైతులు పదును వాన పడితే పంటలు సాగు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేసినా వర్షాలు లేకపోవడంతో రైతులతో కలకలలాడాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల షాపులు వెలవెలబోతున్నాయి. వర్షం కురిస్తే రైతులు పత్తి, మిర్చి, కంది, సజ్జ, కొర్ర, ఆముదం, జొన్న తదితర పంటలు సాగుచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదునుదాటి వర్షాలు కురిస్తే పంటలకు తెగుళ్లు సోకి పెట్టుబడి వ్యయం ఎక్కువవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెట్టుబడి సాయమేది?

ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసే పంటల పెట్టుబడికి ప్రభుత్వం అందించే సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించడంతో రైతులకు కొంత మేర ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తామన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది. ఎకరా పత్తి సాగు చేయాలంటే రూ.50 వేలు, మిర్చికి సుమారు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీంతో రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్న నైరుతి రుతుపవనాలు

జూన్‌లో సాధారణ వర్షపాతం 43.75 మి.మీ కాగా కురిసింది 40.9 మి.మీ

అదును దాటి వర్షాలు కురిస్తే తెగుళ్ల బెడద వెంటాడుతుందని ఆందోళన

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 4,62,944 ఎకరాలు

ఇప్పటి వరకు సాగైంది 1687.7 ఎకరాలు ప్రారంభం కాని ప్రధాన పంటల సాగు

అన్నదాత సుఖీభవ పథకం అమలులో సర్కారు వాయిదాల పర్వం

పెట్టుబడి సాయం కోసం రైతుల ఎదురుచూపులు

ఆకాశమే గంభీరం.. అన్నదాతల్లో సన్నగిల్లుతున్న ఆత్మస్థైర్యం

సాగు అత్యల్పం!

జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో పంటల సాగు లక్ష్యం 4,62,944 ఎకరాలు కాగా ఇప్పటివరకు జిల్లాలో సుమారు 1700 ఎకరాల్లో మాత్రమే వివిధ రకాల పంటలు సాగు చేశారు. ప్రధానంగా వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి, కొర్ర, మినుములు, పెసలు, కంది తదితర ప్రధాన పంటలు సాగు కాలేదు. వరి 12,826 హెక్టార్లు, సజ్జ 7,020, మొక్కజొన్న 3,120, కొర్ర 1,337, పెసలు 949, మినుములు 2,456, కంది 68,287 హెక్టార్లు, నువ్వులు 3,457, ఆముదం 1,537, పత్తి 26,981, మిర్చి 25,217 హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు సజ్జ 88, ఆముదం 10, పత్తి 287, నూగులు 6 హెక్టార్లలో మాత్రమే సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూరగాయలు 237 హెక్టార్లలో సాగవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద ఖరీఫ్‌ సాగు ఆశాజనకంగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వాన పడితేనే పంటలేస్తాం

ఈ ఏడాది జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. పొలాలన్నీ దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నాం. వర్షం పడితే పత్తి, సజ్జ, కంది పంటలు వేసేందుకు అనువుగా ఉంటుంది.

– టి.రామిరెడ్డి, రైతు

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన! 1
1/3

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన!

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన! 2
2/3

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన!

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన! 3
3/3

మేఘం మీద ఆన.. కురవట్లేదు వాన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement