
భూమి హాంఫట్!
1
రూ.
కోటి
సాక్షి టాస్క్‌ఫోర్స్:
మార్కాపురంలో ప్రసిద్ధిగాంచిన చెన్నకేశవ ఆలయానికి చెందిన భూములను కబ్జాల బారి నుంచి కాపాడుకుంటున్నట్లు గొప్పగా డప్పు వేస్తున్న పాలకులు.. కూటమి నాయకుల కబ్జా పర్వాన్ని మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారు. చెన్నకేశవస్వామి ఆలయానికి చెందిన సుమారు రూ.కోటి విలువైన భూమిపై కన్ను వేసిన కూటమి నాయకులు ఆక్రమించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామివారికి భజంత్రీల ఇనాం కింద సుమారు 32 ఎకరాలు కేటాయించారు. అయితే ప్రభుత్వ అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంకు, ఇళ్ల స్థలాలు తదితర నిర్మాణాల కింద కొంత భూమి పోగా ప్రస్తుతం సంక్రాంతి మండపం వద్ద పార్వేట నిమిత్తం 40 సెంట్ల స్థలం మిగిలింది. ఆ భూమిలో కూడా సొసైటీకి చెందిన స్థలం ఉందంటూ కూటమి నాయకులు జేసీబీలతో యథేచ్ఛగా చదును చేశారు. నాలుగేళ్ల క్రితం సంక్రాంతి మండపానికి చెందిన స్థలాన్ని సర్వేయర్ కొలత వేయగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కొందరు టీడీపీ నాయకులు రూ.కోట్ల విలువచేసే ఆ భూమిని కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో సర్వే చేసి సంక్రాంతి మండపానికి కేటాయించిన భూమిలో సొసైటీ పేరుతో అక్కడ ఇంకా స్థలం ఉందని చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. కూటమి నాయకుల కబ్జా పర్వానికి అధికారులు పరోక్షంగా వత్తాసు పలకడం ఎంత వరకు సబబని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సదరు ఆక్రమణలపై ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. సంక్రాంతి మండపం వద్ద సొసైటీకి చెందిన భూమి కొంత ఉందని కొందరు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. స్వామివారికి చెందిన భూమిని కొందరు చదును చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని అంగీకరించారు. అధికారులతో సమీక్షించి ఆలయానికి చెందిన భూమిని ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చెన్నకేశవస్వామి ఆలయ భూమిపై కూటమి నాయకుల కన్ను
సంక్రాంతి మండపం ఫెన్సింగ్ లోపల
భూమి దర్జాగా చదును
చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్న
ఆలయ అధికారులు

భూమి హాంఫట్!