
గ్రావెల్ మటాష్..!
సింగరాయకొండ: కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది టీడీపీ నాయకులు కావడంతో ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో ఉన్న జువ్వలగుంట చెరువులో టీడీపీ నాయకులు గద్దల్లా వాలిపోయారు. గడిచిన వారం రోజులుగా అక్రమంగా గ్రావెల్ తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా రాత్రి వేళల్లో జేసీబీలు, టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో గ్రావెల్ తవ్వి తరలిస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అమాత్యుడి ఆదేశాలతోనే అధికార గణం కళ్లు మూసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
భగ్గుమన్న విభేదాలు
చెరువులో గ్రావెల్‌ను పక్క గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తుండటంతో సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శానంపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల అక్రమ గ్రావెల్ దందాకు వీఆర్‌ఓలు కూడా సహకరిస్తున్నారని, తమ గ్రామ చెరువులో వారి పెత్తనం ఏమిటని మూలగుంటపాడు నాయకులు మంత్రి స్వామి వద్ద పంచాయతీ పెట్టినట్టు తెలిసింది.
చోద్యం చూస్తున్న అధికారులు
వారం రోజుల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులకు పట్టించుకోకపోగా పచ్చ నేతలకు సహకరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు కూడా గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. చెరువులో గ్రావెల్ తవ్వకంతో శ్మశాన స్థలం ధ్వంసమైందని, కర్మకాండలకు ఇబ్బందిగా మారిందని సమీపంలోని వెంకటేశ్వరనగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రావెల్ అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూడాల్సిందే.
జువ్వలగుంట చెరువులో గ్రావెల్
తవ్వేస్తున్న పచ్చ ముఠా
గత వారం రోజులుగా రాత్రి వేళ సాగుతున్న అక్రమ దందా
గ్రావెల్ తవ్వకాలపై పచ్చ తమ్ముళ్ల మధ్య తలెత్తిన విభేదాలు
అక్రమార్కులకు సహకరిస్తున్న
అధికారులు

గ్రావెల్ మటాష్..!