త్యాగానికి ప్రతీక.. బక్రీద్
కనిగిరి రూరల్/కంభం:
ముస్లింలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్ పండుగ ఒకటి. దీనినే ఈదుల్ అజహా, ఈదుజ్జుహా అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్ హిజ్ 10వ తేదీ బక్రీద్ పండుగను ముస్లింలు నిర్వహించుకుంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాల్లో ఒకటైన హజ్ తీర్థ యాత్రను కూడా ముస్లింలు ఈ నెల ప్రారంభంలోనే భక్తిప్రవత్తులతో, నియమ నిష్టలతో చేస్తారు. నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఈదుల్ జుహా అనేది మనిషి త్యాగనిరతిని చాటి చెప్పే పండుగ. ఈ పండుగనే బక్రీద్ అంటారు. బక్రీద్ ఎందుకు జరుపుకుంటారంటే.. హజ్రత్ ఇబ్రహీం (సో.అ.స) వారు నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లాహ్ కనిపించి, నీకు ఆత్యంత ప్రాణమైన నీ ఎనిమిదేళ్ల వయస్సు గల కుమారుడిని నాకు (అల్లాహ్ మార్గంలో ఖుర్బాని) దేవుని పేరిట త్యాగం ఇవ్వమని కోరతారు. నిద్ర నుంచి మేల్కొన్న ఇబ్రహీం (సో.అ.స) తన కుమారుడు ఇస్మాయిల్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తారు. దైవ భక్తుడైన ఇస్మాయిల్ తాను దైవానుసారం, దైవాజ్ఞ అమలుపరిచేందుకు సిద్ధంగా ఉన్నానని అంగీకారం తెలుపుతారు. దీంతో అల్లాహ్ ఆదేశానుసారంగా ఇబ్రహీం (సో.అ.స) తన ఏకై క పుత్రుడైన ఇస్మాయిల్‌ను ఖుర్బానీ ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. కలలో ఆదేశించిన సూచనల మేరకు అడవిలోని ఏకాంత ప్రదేశంలో రాతిపై ఇబ్రహీం (సొ) కుమారుడు ఇస్మాయిల్‌ను సమర్పించేందుకు తీసుకెళ్తారు. వెంట తల్వార్ (పదునైనా కత్తి) కూడా తీసుకెళ్తారు. ఈ క్రమంలో బాలుడు (ఇస్మాయిల్) నాన్నా.. నా మీద ఉన్న ప్రేమతో నీవు కత్తిని గొంతుపై కోయలేవు. నా మొహానికి గుడ్డ కట్టి నాపై కత్తి కోయాలని చెప్తాడు. ఆ రీతిలో కుమారుడిని ఖుర్బానీ ఇచ్చేందుకు తల్వార్ (పదునైన కత్తి)తో కుమారుడి గొంతుపై నరుకుతాడు. కానీ ఆ కత్తి తెగలేదు. ఆ సమయంలో అల్లాహ్ (దేవుడు) ఇబ్రహీం త్యాగనిరతిని ప్రశంసిస్తూ.. సంతోషిస్తూ.. ఒక్కసారిగా ఇస్మాయిల్ పడుకోబెట్టిన స్థానంలో ఒక పొట్టేలును ప్రత్యక్షం చేస్తాడు. దీంతో పొట్టేలు జువా అవుతుంది. దీంతో అల్లా దేవదూత అయిన జిబ్రయిల్ (సొ) అక్కడికి వచ్చి మీరు అల్లాహ్ పెట్టిన అగ్ని పరీక్షల్లో నెగ్గారని చెప్తారు. దీనికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగ నిర్వహించుకుంటారు. నాటి నుంచి నేటి వరకు అలాగే ప్రళయదినం రోజు దాకా బక్రీద్ పండుగ రోజు స్థితిమంతులు, ఉన్నతులు, ఆర్థిక స్థోమత ఉన్నవారు పొట్టేలు మాంసాన్ని ఖుర్బాని పేరుతో పేదలకు పంచుతారు.
బక్రీద్ పండుగ సందర్భంగా ఇచ్చే ఖుర్బానీని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒంటె, మేక, పొట్టేలును ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ చేసిన తర్వాత దాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. ఒక భాగాన్ని పేదలకు, మరో భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకోభాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు.
రంజాన్ ప్రార్థనల మాదిరిగానే బక్రీద్ పండుగకు కూడా ఈద్గాల వద్ద నమాజ్ చదువుతారు. ధార్మిక ప్రసంగం (ఖుద్బా) తర్వాత ఈద్గా నమాజ్ జరుగుతుంది. బక్రీద్ నమాజ్‌ను ఈద్గా లేదా మసీదులో సామూహిక (జమాత్‌తో) ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహిస్తారు.
బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు నిర్వహించే ప్రార్థనలకు ఈద్గా మైదానాలతో పాటు మసీదులు ముస్తాబయ్యాయి. ప్రార్థనలకు వెళ్లేవారు తమ ఇళ్ల వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరి ఈద్గా మైదానాలలో ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈద్గా వద్దకు వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు, ఇతరుల కోసం మసీదుల్లో ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఈద్గాలో నమాజులు ప్రారంభమవుతాయని, ఆలోపు అందరూ అక్కడికి చేరుకోవాలని కమిటీ పెద్దలు తెలిపారు.
నేడు భక్తిశ్రద్ధలతో పండుగ
జరుపుకునేందుకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు
ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్‌లు
ముస్తాబైన మసీదులు
త్యాగనిరతిని చాటి చెప్పే పండుగ...
ఈద్గా వద్ద నమాజ్...
మూడు భాగాలుగా విభజించి...
కనిగిరిలో రెండు చోట్ల...
కనిగిరిలో రెండు చోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు సమయాన్ని, ప్రదేశాలను ఇప్పటికే ప్రకటించారు. మసీద్ ఏ అలీ పాత 4వ వార్డు ప్రస్తుత 8వ వార్డులో మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ ఇంటి సమీపంలోని మసీద్‌లో ఉదయం 7 గంటలకు బక్రీద్ పండుగ ప్రత్యేక బయాన్, 7.30 గంటలకు ప్రత్యేక నమాజ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వృద్ధులు, ఆరోగ్యం బాగా లేని వారు, నడవలేని వారు ఇక్కడ నమాజ్ చదువుకుంటారు. అలాగే, కనిగిరి పెద్ద చెరువు వద్ద గల ప్రత్యేక ప్రార్థనా స్థలంలో (ఈద్గా వద్ద) ఉదయం 9 గంటలకు బయాన్, అనంతరం 9.30 గంటలకు ప్రత్యేక నమాజ్ జరుగుతుందని ముస్లిం పెద్దలు తెలిపారు.
ప్రత్యేక ప్రార్థనలకు సిద్ధమైన మసీదులు,
ఈద్గాలు...
త్యాగానికి ప్రతీక.. బక్రీద్


