చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
● విద్యార్థులకు ఎస్పీ దామోదర్ పిలుపు
ఒంగోలు టౌన్: చిన్నారులు చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ రాణించాలని, తలిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ గ్రౌండులో నిర్వహించిన చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంపు ముగింపు సభలో ఆయన మాట్లాడారు. విలువలతో కూడా విద్య బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారులు క్రమశిక్షణతో మెలగాలని, నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులు, గురువులు చెప్పే మాటలు వినాలని, వారి అనుభవాలను పాఠాలుగా అధ్యయనం చేయాలని సూచించారు. చిన్నారుల్లో నేర్చుకునే గుణం ఎక్కువగా ఉంటుందని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మరింత మెరుగుపెట్టడమే ఉపాధ్యాయులు చేయాల్సిన విధి అని చెప్పారు. సమ్మర్ క్యాంపులో నిపుణులైన కోచ్ ద్వారా చిన్నారులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఫుట్‌బాల్, టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, ఇతర క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు. క్యాంపు విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీసు చిల్డ్రన్స్ కమిటీ ప్రెసిడెంట్ రాజేంద్ర, వివిధ రంగాలకు చెందిన నేషనల్ క్రీడాకారులకు ఎస్పీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఎస్పీ అశోక్‌బాబు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, క్రీడాకారులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది.


