దర్శి (కురిచేడు): దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి 6వ వర్ధంతి ఆదివారం చీమకుర్తిలోని కమలాకర్‌రెడ్డి పార్కు బూచేపల్లి సుబ్బారెడ్డి ఘాట్ వద్ద నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు హాజరై నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. దర్శి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని ఆయన కోరారు.
పిడుగుపాటుకు వ్యక్తి బలి
పెద్దారవీడు: మండలంలోని పోతంపల్లి గ్రామానికి చెందిన వలపర్ల పెద్దగాలెయ్య పిడుగుపడి శనివారం సాయంత్రం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వలపర్ల పెద్దగాలెయ్యకు చెందిన గేదె సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో పొలాల్లో వెతికేందుకు బావమరిది బెజవాడ రామయ్యను తోడుగా తీసుకెళ్లాడు. కర్రోల గ్రామం పొలాల్లో కొన్ని గేదెలు ఉండటంతో అక్కడైమైనా తమ గేదె ఉందోమోనని తొందరగా వెళ్తున్నారు. ఆయన బావమరిది వెనుక నిదానంగా వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులు, చిన్నపాటి వర్షం కురుస్తోంది.
గేదెను వెతుకుతున్న సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులు రావడంతో పిడుగుపడి వలపర్ల పెద్దగాలెయ్య (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు బావమరిది ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని ప్రశ్నించే ప్రయత్నం చేయగా సమాధానం లేదు. రామయ్య అక్కడికి వెళ్లి చూడగా పెద్ద గాలెయ్య నిర్జీవంగా పడి ఉన్నాడు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య
● మృతుడిది కర్ణాటక రాష్ట్రంగా అనుమానం
పెద్దారవీడు: మండల పరిధిలోని పోతంపల్లి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కింద గుర్తు తెలియని యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమాన్ జంక్షన్ కుంట నుంచి దోర్నాల వరకు జాతీయ రహదారిలో నూతనంగా తారు రోడ్డు నిర్మాణంలో భాగంగా పోతంపల్లి–రాజంపల్లి గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఇనుప చువ్వలకు తన చొక్క కట్టుకొని ఊరేసుకున్నాడు.
మృతుడికి సుమారు 35 ఏళ్లు ఉండొచ్చని, ఒంటిపై బ్లూ కలర్ బార్డర్ కలిగిన ఎర్ర రంగు బనియన్, లైట్ షేడ్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ప్యాంటు జేబులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కెఏ 4420160001511 నంబరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మృతుడి గురించి తెలిసిన వారు పెద్దారవీడు పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ 9121102186 లేదా హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు సెల్ 9908056611 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు.