వక్ఫ్‌ సవరణ చట్టం రద్దుచేయాలి | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ సవరణ చట్టం రద్దుచేయాలి

Apr 17 2025 1:17 AM | Updated on Apr 17 2025 1:17 AM

వక్ఫ్‌ సవరణ చట్టం రద్దుచేయాలి

వక్ఫ్‌ సవరణ చట్టం రద్దుచేయాలి

మార్కాపురం: కేంద్ర ప్రభుత్వం ముస్లింల మనోభావాలను దెబ్బతిసేలా ఇటీవల తయారు చేసిన వక్ఫ్‌ సవరణ చట్టంను వెంటనే రద్దుచేయాలని ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషేర్‌ ఆలీబేగ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో బుధవారం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టులో సవాలు చేసిందని తెలిపారు. నూతన చట్టంలో వక్ఫ్‌ నిర్వచనాన్ని మార్చారన్నారు. కొన్ని శతాబ్దాలుగా ఉన్న మసీదులు, ముస్లిం శ్మశాన వాటికలు, దర్గాలు, ముస్లిం మత ప్రదేశాలన్నీ కూడా ఎలాంటి డీడ్స్‌ లేకపోయినా వక్ఫ్‌బోర్డుల పరిధిలో కొనసాగుతూ వక్ఫ్‌ ఆస్తులుగా ఉన్నాయని అన్నారు. నూతన చట్టం ప్రకారం వాటన్నింటిపై బోర్డుకున్న హక్కు తొలగిపోతుందని చెప్పారు. దీని ద్వారా ఆస్తుల స్వాధీనం లేదా పునర్‌ వర్గీకరణకు అవకాశం ఏర్పడుతుందన్నారు. దీంతో లెక్కలేనన్ని చారిత్రక, సాంస్కృతిక, వారసత్వానికి ప్రతీకగా నిలిచే ప్రదేశాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన చట్టంలో వక్ఫ్‌బోర్డు సీఈఓగా ముస్లిం వ్యక్తే ఉండాలన్న నిబంధనను తొలగించడంతోపాటు సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌, వక్ఫ్‌ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పిస్తారని అన్నారు. ఇవి తమ హక్కులకు భంగం కలిగించడమేనని, మతాల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు. ముస్లింల ప్రాథమిక హక్కుల కల్పనకు వ్యతిరేకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఏ వక్ఫ్‌ ఆస్తినైనా ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని అధికారులకు కట్టబెడుతున్నారని, ఇది ముస్లిం ధార్మిక సంస్థలను బలహీనపరచడమే అన్నారు.

ముస్లింలే లక్ష్యంగా..

ముస్లింలు, వారి ధార్మిక సంస్థను లక్ష్యంగా చేసుకుని నూతన బిల్లును ప్రభుత్వం తయారు చేసిందని షంషేర్‌ ఆలీబేగ్‌ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధం కాబట్టే ఈ చట్టాన్ని సవాలుచేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిందన్నారు. సమావేశంలో నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు కౌన్సిలరు సలీమ్‌, కోఆప్షన్‌ సభ్యులు అమీరుల్లాఖాన్‌, కౌన్సిలర్‌ సెక్షావలి, కరీముల్లా, రిటైర్డు వార్డెన్‌ నజీర్‌ అహ్మద్‌, మైనార్టీ నాయకులు ఫరతుల్లా బేగ్‌, ఇస్మాయిల్‌, గౌస్‌ మొద్దీన్‌, కరీమ్‌బాషా, సీయం ఖాశీం, న్యాయవాది ఆసీఫ్‌ఖాన్‌, కోఆప్షన్‌ సభ్యులు మహమ్మద్‌ రఫీ, గఫూర్‌ మహబూబ్‌ బాషా, సోషల్‌మీడియా రఫీ, మున్వర్‌, మౌలాలీ, షాదీఖానా ప్రెసిడెంట్‌ ఇస్మాయిల్‌, ఉస్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ షంషేర్‌ ఆలీబేగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement