
20 ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీకి వందలాది కోట్ల రూపాయల మేరకు బకాయిలు చెల్లించకపోవడంతో జిల్లాలోని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో సోమవారం నుంచి సేవలను బంద్ చేశారు. ఆరోగ్య శ్రీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారం రోజుల క్రితమే జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణకు సమ్మె నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. జిల్లాలో మొత్తం 120 కు పైగా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఉండగా వాటిలో 42 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు 150 నుంచి 200 మంది వరకు వివిధ హాస్పిటళ్లలో ఆరోగ్య శ్రీ కింద అడ్మిట్ అవుతున్నారు. ఒంగోలులోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి రోజువారి కనీసం 30 నుంచి 50 ఓపీలు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయకుండా ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుండడంతో విసుగు చెందిన జిల్లాలోని 20కి పైగా ఆస్పత్రులు సమ్మెకు దిగాయి. అత్యవసర సేవలను మినహాయించి రెగ్యులర్ ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో నిరుపేద సామాన్య రోగులు ఇబ్బందులకు గురయ్యారు. ఆరోగ్య శ్రీ ఉంది కదాని మారు మూల ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరాశగా వెనుతిరిగి వెళ్లడం కనిపించింది. అంతేకాకుండా గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులు కొందరు ఇప్పటికే ఆరోగ్య శ్రీ కింద ఆస్పత్రిలో చేరి ఉన్నారు. ఆపరేషన్ల అప్రూవల్ కోసం ఎదరు చూస్తున్నారు. ఇప్పుడీ సమ్మె నోటీసు రావడంతో అప్రూవల్ వస్తుందో లేదో, ఆపరేషన్ జరుగుతుందో లేదో అనే ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సమ్మెకి సకాలంలో స్పందించి బకాయిలు విడుదల చేస్తే సరేసరి లేకపోతే ఆపరేషన్‌కు సొంతంగా డబ్బులు చెల్లించాలని కొందరు వైద్యులు చెప్పి పంపిస్తున్నారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో పలువురు ఆరోగ్య మిత్రలు విధులకు డుమ్మా కొట్టారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదని కొందరు రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. ఏదో చేస్తారని నమ్మి ఓటేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కోలుకోలేని దెబ్బ తీశారని రోగులు దుమ్మెత్తి పోస్తున్నారు.