
జింక కళేబరం
● కోర్టుకు తరలింపు, ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్
పెద్దదోర్నాల: బాలికలను నిర్బంధించిన కేసులో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కొమరోలు శ్రీనివాసప్రసాద్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై అంకమ్మరావు కథనం మేరకు... బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసుకు సంబంధించి ఇన్‌చార్జి డీఎస్పీ టి.అశోక్‌వర్దన్‌రెడ్డి విచారణ నిర్వహించారు. పూర్తి విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి ఆదివారం ఉదయం గిద్దలూరు కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడికి ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
అగ్రహారంలో జింక మృతి
చీమకుర్తి: చీమకుర్తికి కూతవేటు దూరంలో గల అగ్రహారంలోని ఆలయ సమీపంలో జింక మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చుట్టుపక్కల పొలాల నుంచి వచ్చిన జింక ఏమైందో ఏమోగానీ గత శుక్రవారం మృతి చెందింది. స్థానిక సర్పంచ్, వీఆర్‌ఓ, వలంటీర్ కలిసి స్థానిక అధికారుల ద్వారా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కానీ, ఆదివారం రాత్రి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో సాక్షి దినపత్రిక దృష్టికి తీసుకొచ్చారు. జింక మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో రోడ్డు మీద రాకపోకలు సాగించే వారు చూసి వన్యప్రాణి చనిపోతే ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. దీనిపై ఫారెస్ట్ రేంజర్ నరసింహారావును వివరణ కోరగా, స్థానిక ఫారెస్ట్ గార్డ్ శబరిమలై వెళ్లారని, సోమవారం దగ్గరలో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని పంపించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వ్యాయామ ఉపాధ్యాయులను
శిక్షణకు పంపాలి
ఒంగోలు: వ్యాయామ ఉపాధ్యాయులను ఆడుదాం ఆంధ్ర శిక్షణకు హాజరయ్యేందుకు రిలీవ్ చేయాలని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావు ఆదేశించారు. 11వ తేదీ అన్ని మండలాల్లో మండల స్థాయిలో వలంటీర్లకు ఆడుదాం ఆంధ్రాపై శిక్షణ ఉన్నందున అందరూ వ్యాయామ ఉపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖాధికారుల వద్ద రిపోర్టు చేయాలని ఆదేశించారు.