మార్కాపురం: పోస్టల్ ఉద్యోగుల సేవలు అభినందనీయమని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి కొనియాడారు. మార్కాపురం పట్టణంలోని మాధవీ గ్రాండ్ ఇన్‌లో ఆదివారం నిర్వహించిన అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘ గ్రూప్ సీ 40వ రాష్ట్ర మహాసభల్లో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి పోస్టల్ సేవలు ప్రజలకు అందుతున్నాయని, కాలానుగుణంగా వస్తున్న మార్పులను పోస్టల్ శాఖ కూడా అన్వయించుకుని ప్రజలకు సేవలందించడం అభినందనీయమని అన్నారు. ఎండా, వాన లెక్క చేయకుండా పోస్టల్ ఉద్యోగులు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తున్నారని, వారి సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాసేవలో పోస్టల్ ఉద్యోగులు వెలకట్టలేని సేవలు అందిస్తున్నారన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ముందుంటుందన్నారు. ప్రజలకు సేవలందించేందుకు వివిధ రకాల ప్రైవేటు సంస్థలు వచ్చినప్పటికీ పోస్టల్ ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మార్కాపురం పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరయ్యేందుకు తమ సిబ్బంది ముందుటున్నారని తెలిపారు. అనేక రకాల పథకాలు అందిస్తున్నారన్నారు. మార్కాపురం ప్రధాన తపాలా కార్యాలయ పోస్టుమాస్టర్ సయ్యద్ సుభానీ, ఉద్యోగుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ పోస్టల్ పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం అనేక ఇన్సూరెన్స్ పథకాలు, డిపాజిట్ల పథకాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ప్రజలకు ఉద్యోగులు వివరించాలని కోరారు. తొలుత పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మార్కాపురం శాఖ కార్యదర్శి అర్షద్‌ఖాన్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు డీకే రఫీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే కేపీ
ఘనంగా తపాలా ఉద్యోగుల సంఘ 40వ రాష్ట్ర మహాసభలు


