ఒంగోలు: గిరిజన తెగల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రం అమలుచేస్తున్న కళ్యాణ్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, వాటి ప్రస్తుత స్థితి గురించి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించారు. దానికి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయక మంత్రి రేణుకసింగ్ సరుత సమాధానమిచ్చారు. దేశంలో గిరిజన తెగలు, ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధానంగా విద్య, జీవనోపాధి కల్పనకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ అమలుచేస్తున్న కల్యాణ్ యోజన పథకం కింద పలు పథకాలు ఉన్నాయన్నారు. ఈ పథకాన్ని కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యంతో 2021–22 నుంచి 2025–26 వరకు అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో 5 భాగాలు ఉన్నట్లు వివరించారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన భాగం కింద 8 గిరిజన అభివృద్ధి రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదన్నారు. 2022–23లో గిరిజన సమూహాల అభివృద్ధి భాగం కింద రూ.16.45 కోట్లు, గిరిజన పరిశోధనా సంస్థల మద్దతు భాగం కింద రూ.2.19 కోట్లు, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ (పదో తరగతిలోపు)– రూ.37.93 కోట్లు, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌లు (పదో తరగతి పై తరగతులు) రూ.64.14 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసినట్లు కేంద్రమంత్రి రేణుకసింగ్ సరుత వివరించారు.