ఒంగోలు: జిల్లాలోని ఐదు బస్టాండ్లలో ఖాళీగా ఉన్న స్థలాలను 15 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సుధాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, 22వ తేదీ మధ్యాహ్నం 10.30 నుంచి 2 గంటల్లోపు నెల్లూరు జోన్–3 ఈడీ కార్యాలయంలోని టెండర్ బాక్సులో బిడ్ వేయాలని సూచించారు. అదేరోజు సాయంత్రం 3 గంటలకు టెండరుదారుల సమక్షంలోనే బిడ్లు తెరవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఐదు ప్రదేశాల్లో ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. వాటిలో ఒంగోలు గ్యారేజీలో (ఆర్టీసీ ఆస్పత్రి ఎదురుగా) ఉన్న 1978 చదరపు గజాలు, పామూరు బస్టాండు (బిట్–2)లో 2,565 చదరపు గజాలు, కొండపిలో 8225 చదరపు గజాలు, సింగరాయకొండ (బిట్–4)లో 300 చదరపు గజాలు, గిద్దలూరు గ్యారేజీ వెనుక 13262 చదరపు గజాలు ఉన్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారికి పూర్తి వివరాలు తెలియజేసేందుకు ఈ నెల 14న ఒంగోలు ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని ప్రజారవాణా అధికారి కార్యాలయంలో ముందస్తు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెండరుదారులు ప్రతి పేజీలో సంతకం చేయాలని, పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఆర్‌టీసీ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో టెండర్ విభాగంలో పరిశీలించుకోవాలని సూచించారు.