
● వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి
ఒంగోలు: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా శాఖను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మాంటిస్సోరి ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సరానికి సంబంధించి అసోసియేషన్ జిల్లా డైరీ, క్యాలెండర్లకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అదే విధంగా అసోసియేషన్ సభ్యత్వ నమోదుకు సంబంధించి మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసోసియేషన్ బలోపేతం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సభ్యత్వాన్ని పెంచాలన్నారు. జిల్లా అధ్యక్షుడు మట్టిగుంట మహేశ్వరరావు మాట్లాడుతూ ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీపై బీఈడీ, బీపీఈడీ చేసుకునేందుకు అవకాశం ఉన్నందున దరఖాస్తు చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించేలా సర్టిఫికెట్లు మంజూరు చేయించాల్సిన అవసరాన్ని చర్చించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర కార్యదర్శి బీసాబత్తిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ లోన్లు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతం రమణారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు అన్నింటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా ఆర్థిక శాఖ కార్యదర్శి వై.కృష్ణప్రసాద్, ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎన్.రవిశేఖరరెడ్డి, ఎస్‌కె ఉస్మాన్ సాహెబ్, వైసీ యోగిరెడ్డి, నర్సయ్య, కె.కొండలరాయుడు, పి.శేషిరెడ్డి, తిమోతి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.