
లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్
యర్రగొండపాలెం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు పొందేందుకు తమకు అర్హత ఉంటే చాలని, వర్గాలు, రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం ఉండదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని గోళ్లవిడిపి గ్రామ సచివాలయం పరిధిలో శనివారం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా పింఛన్‌దారులకు ప్రతి నెల 1వ తేదీనే అందజేసేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. పింఛన్ పొందేందుకు కేవలం అర్హత మాత్రమే తమ ప్రభుత్వం చూస్తుందని, ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా అర్జీ దాఖలు చేసుకోవచ్చని చెప్పారు.
పచ్చ కండువా కప్పుకుంటేనే పింఛన్
గత టీడీపీ ప్రభుత్వ కాలంలో పింఛన్ మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీల ఇళ్ల చుట్టూ తిరగాలని, పచ్చ కండువా కప్పుకుంటేనే పింఛన్ మంజూరవుతుందని చెప్పేవారని ఆయన విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి లేదని కేవలం తమ ఇళ్లవద్దకు వచ్చే వలంటీర్లకు సమాచారం ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని, సంక్షేమ పథకాల కోసం అర్జీలు పెట్టుకోవటానికి గతంలో మాదిరిగా దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా తమకు సమీపంలోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశామని అన్నారు.
తక్షణ పరిష్కారం కోసమే గడప గడపకు..
ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారని, దీర్ఘకాలంగా పడిఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించుకోవటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఒక్కొక్క సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేయడం సీఎం ఆలోచన విధానానికి అద్దం పడుతుందని, ప్రతి శాసనసభ్యుడికి రూ.2 కోట్లు నిధులు కేటాయించడం వలన ప్రజలు ఏమి ఆశిస్తున్నారో ఆ పరిష్కారాలు చేసేందుకు ఉపయోగించే అవకాశం కలిగిందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు కె.ఓబులరెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ షాబీర్‌బాష, సచివాలయాల మండల కన్వీనర్ సయ్యద్ జబీవుల్లా, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ కె.జయరావు, తహసీల్దార్ కె.రవీంద్రరెడ్డి, ఎంపీడీవో వై.వి.నాగేశ్వర ప్రసాద్, ఎంఈవో పి.ఆంజనేయులు, ఏపీవో ఎం.శైలజ, ఏఈలు అల్లూరయ్య, శ్రీకాంత్, అంజిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్