
రమ్య మృతదేహం
చీమకుర్తి: అనుమానమే నిజమైంది. పాఠశాల నుంచి ఇంటికెళ్లే దారిలో ఉన్న పాడుబడిన బావిలో చిన్నారి రమ్య శవమై తేలింది. సంతనూతలపాడు మండలం మద్దులూరులో శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరిన ఐదేళ్ల బాలిక మనుబ్రోలు రమ్య అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. పాప కోసం శుక్ర, శనివారాలు ఒంగోలు ఏఎస్‌పీ, డీఎస్‌పీ, ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే రోడ్డుపై పదుల సంఖ్యలో పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. కానీ, రోడ్డు పక్కనున్న బావిలో పడి ఉంటుందనే అనుమానం ఉన్నప్పటికీ నీటిలో పూర్తిగా గాలించలేదు. చివరకు శనివారం సాయంత్రం అదే బావిలో శవమై తేలింది. పాఠశాల నుంచి రమ్య ఇంటికెళ్లే దారిలో పాడుబడిన బావి ఉంది. ఆ బావి చుట్టూ పిచ్చిమొక్కులు పెరిగి బావిని అల్లుకుని ఉన్నాయి. బావి చుట్టూ రెండున్నర అడుగుల ఎత్తున గోడ కట్టి ఉంది. ఆ గోడ ఎక్కి మరీ బావిలో ఎందుకు పడుతుందిలే అనుకున్నారు అందరూ. ఒకవేళ బావి గోడ ఎక్కి పొరపాటున జారిపడి ఉంటుందేమోనన్న అనుమానం పోలీసులు, స్థానికులకు రాలేదు. కొంతమందికి అనుమానం వచ్చినా అప్పటికే శుక్రవారం రాత్రి కావడంతో చీకట్లో బావిలోకి టార్చ్‌లైట్ వేసి మొక్కుబడిగా చూశారు. శనివారం పగటి పూట కూడా బావిలో వెతకలేదు. శుక్రవారం మద్దులూరు గ్రామంలోకి చిత్తుకాగితాలు కేరుకునే కొంతమంది రావడంతో అదృశ్యమైన బాలికను వారు ఏమైనా తీసుకెళ్లి ఉంటారేమో అనే అనుమానం దిశగా పోలీసుల విచారణ సాగింది. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో బావిలో మళ్లీ ఒకసారి పోలీసులు చూడగా, పాపతో పాటు స్కూల్ బ్యాగు నీటిపై తేలియాడుతూ కనిపించడంతో వెంటనే బయటకు తీశారు. రమ్యతో పాటు బడికి వెళ్లే ఆమె అక్కను పోలీసులు విచారించారు. ప్రతి రోజు బడికి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు పిల్లలంతా కలిసి బావి దగ్గరకు వెళ్లి బావిలోకి రాళ్లు విసురుతారని ఆమె చెప్పింది. రమ్య కూడా రాళ్లు వేసేందుకు బావి వద్దకు వెళ్తుండేదని చెప్పింది. అయితే, బావి ఒడ్డు ఎక్కి పొరపాటున జారిపడి ఉంటుందా.? లేకుంటే ఎవరైనా కావాలనే బావిలో పడేసి ఉంటారా..? అనే అనుమానాలు ఉన్నాయి. ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు. బావిలో నుంచి బయటకు తీసిన రమ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఒంగోలు తరలించారు. తల్లి కోటేశ్వరి ఫిర్యాదు మేరకు సంతనూతలపాడు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేశారు. రమ్య మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది.
పాఠశాల నుంచి ఇంటికెళ్లే దారిలో పాడుబడిన బావిలో రమ్య మృతదేహం లభ్యం

మృతికి కారణమైన బావి