
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
త్రిపురాంతకం: ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం సందర్భంగా త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలో శనివారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారనేందుకు ఇదే నిదర్శనమని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే బాటలో ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి ప్రజల అవసరాలన్నీ తీరుస్తున్నారన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని, దానికనుగుణంగా మంచి పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. ఇప్పటికే మూడు దశల్లో కార్యకర్తలు ఇంటికొచ్చి పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ ఏడు రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ మెరుగైన వైద్యసేవలు అందించి మందులు అందించడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం పేదవర్గాలందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైద్యులంతా అందుబాటులో ఉండి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యర్రగొండపాలెంలో వంద పడకల ఆస్పత్రి వైద్యసేవలందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా మార్కాపురంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణంలో ఉందన్నారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. కలలో కూడా ఊహించని విధంగా వైద్యరంగంలో మార్పు తేవడం జరిగిందని సురేష్ వివరించారు. ప్రజలంతా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను మంత్రి సురేష్ పరిశీలించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించి వృద్ధులకు కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ మాకం జాన్‌పాల్, గ్రామసర్పంచ్‌లు గుమ్మ యల్లమ్మ, పొన్న వెంకటలక్ష్మి, ఓబులురెడ్డి, వెంకట తిరుమలయ్య, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా కార్యదర్శి ఆర్‌వీ పిచ్చయ్య, పార్టీ కన్వీనర్ ఎస్.పోలిరెడ్డి, కో కన్వీనర్ యల్లారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు దగ్గుల గోపాల్‌రెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓలు శ్రీనివాసరావు, పద్మావతి, వైద్యాధికారి నాగేశ్వరరావు నాయక్, కరుణకుమార్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ త్రిపురాంతకం మండలం మేడపిలో ఘనంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభం