
గుర్రం జాషువా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
చీమకుర్తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒంగోలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికి తిరిగి అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారన్నారు. వారిలో అనారోగ్యంతో బాధపడే వారందరికీ నియోజకవర్గంలో ఈ నెల 30 నుంచి ప్రత్యేక మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచితంగా వైద్యం అందించడంతో పాటు మందులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు స్థానిక నాయకులు, మండల స్థాయి నాయకులు కలిసి జగనన్న సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసే వైద్యశిబిరాలను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలో ప్రజలకు వివరిద్దాం...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలో ప్రజలకు వివరించేందుకు రాష్ట్రానికి ఆయన చేసిన మేలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని పార్టీ నాయకులకు ఎమ్మెల్యే టీజేఆర్ దిశానిర్దేశం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్నను ఆశీర్వదించాలని ప్రజలకు తెలియజెప్పాలన్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలకతీతంగా ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి గ్రామానికి చేసిన అభివృద్ధి పనులను వివరించాలన్నారు. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలాల కన్వీనర్లు పోలవరపు శ్రీమన్నారాయణ, మండవ అప్పారావు, దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, దుంపా రమణమ్మ, జేసీఎస్ కన్వీనర్ కుమ్మూరి సుధాకర్‌రావు, పార్టీ జిల్లా కార్యదర్శి గట్టినేని అయ్యన్న, మారెడ్డి వీరారెడ్డి, నాలుగు మండలాల నుంచి పలువురు ప్రధాన నాయకులు పాల్గొన్నారు.
గుర్రం జాషువాకు నివాళులు...
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన రచించిన కవితలు ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని, దళిత జాతిని మేల్కొలపడానికి చేసిన రచనలు ఎంతో చైతన్యవంతమైనవని కొనియాడారు.