
ఒంగోలు నగరంలో జనాభా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా నగరాన్ని అభివృద్ధి చేయటంతో పాటు సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తలంచారు. ఆమేరకు నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రాంలో భాగంగా నగర సుందరీకరణ కోసం రూ.9.10 కోట్లతో అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2020–21 సంవత్సరం నుంచి పనులు చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. మొదటి సంవత్సరం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. 2021–22 సంవత్సరంలో రూ.0.64 కోట్లు, 2022–23 సంవత్సరంలో రూ.2.51 కోట్లు నిధులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు సంవత్సరాలకు గాను మొత్తం రూ.5.16 కోట్లు మంజూరు చేయగా రూ.3.79 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈ మూడు సంవత్సరాలకు గాను 16 పనులు చేపట్టి రూ.1.86 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో ఒంగోలు నగరంలోని సిమెంట్ రోడ్లు విస్తరణ పనులు, డివైడర్ల నిర్మాణ పనులు, మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు పార్కుల అభివృద్ధి, సుందరీకరణ పనులు కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. 2023–24 సంవత్సరానికి గాను మొత్తం 20 పనులతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకుగాను రూ.3.91 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాలు రూపొందించి ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రావు ఈ పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం సిటీ లెవల్ ఇప్లిమెంటేషన్ కమిటీ సమావేశంలో కూడా ఆమోదింపజేశారు. ఈ నాలుగు సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.9.10 కోట్లతో పూర్తి స్థాయిలో పనులు చేపట్టనున్నారు.