ఒంగోలు సబర్బన్: వందే భారత్ రైళ్ల ప్రవేశంతో రైలు ప్రయాణంలో నూతన శకం ఆరంభమైందని కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు విజయవాడ నుంచి చైన్నెకి ప్రవేశపెట్టిన నూతన వందే భారత్ రైలు మొదటి ప్రయాణంలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఒంగోలు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్, రైల్వే అధికారులు, పలువురు ప్రముఖులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వందే భారత్ రైలుకు ఒంగోలులో ఘన స్వాగతం పలికారు. నగరంలోని ప్రజలు, ప్రయాణికులు వందే భారత్ రైలును చూడటానికి ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వందే భారత్ రైలు చైన్నె వెళ్లటానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ రైలు వల్ల ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని వెల్లడించారు. ఒంగోలు ప్రాంత వాసులతో పాటు జిల్లాలోని ప్రజలకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. వందే భారత్ రైలు చైన్నె, తిరుపతి వెళ్లేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇంత సౌకర్యవంతమైన రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కలెక్టర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైలును అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజినీర్లను కూడా కలెక్టర్ అభినందించారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో రూ.26 కోట్ల అంచనా వ్యయంతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన కుమారుడు, కుమార్తెతో కలిసి వందే భారత్ రైలులో సింగరాయకొండ వరకు ప్రయాణించారు. రైలులోని ప్రయాణికులతో ముచ్చటించారు. వందే భారత్ రైలు ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకున్నారు. రైలులో ప్రయాణికులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ రైలులో ప్రయాణించటం గొప్ప అనుభూతి అని కలెక్టర్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులతో పాటు పలువురు బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. చైన్నె నుంచి విజయవాడ వైపునకు వెళ్లే వందేభారత్ రైలు ఉదయం గం.10.09కు ఒంగోలుకు వస్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి చైన్నె వైపునకు వెళ్లే రైలు సాయంత్రం గం.5.03కు ఒంగోలు చేరుకుంటుంది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు జనం జేజేలు
సింగరాయకొండ: స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆగిన విజయవాడ–చైన్నె వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు జనం జేజేలు పలికారు. వందేభారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక రైల్వేస్టేషన్‌లో 5 నిమిషాలు ఆగింది. కలెక్టర్ ఆర్‌ఎస్ దినేష్‌కుమార్ తన పిల్లలతో కలిసి ఒంగోలు నుంచి సింగరాయకొండ వరకు రైలులో ప్రయాణించి స్థానిక స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గంలో ఒంగోలు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వందేభారత్ రైలులో పిల్లలతో సహా ప్రయాణించడం ప్రత్యేక అనుభూతి చెందానన్నారు. స్థానిక ప్రజలు ఈ రైలు ప్రతిరోజు ఆపాలని డిమాండ్ చేశారు. కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజి కరస్పాండెంట్ కంచర్ల రామయ్య, వివిధ పార్టీల నాయకులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
రైలుకు ఘన స్వాగతం పలికిన కలెక్టర్, రైల్వే అధికారులు రైలులో అధునాతన సౌకర్యాలున్నాయన్న కలెక్టర్ తన కుమారుడు, కుమార్తెతో కలిసి సింగరాయకొండ వరకు ప్రయాణించిన కలెక్టర్ దినేష్ కుమార్