
గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందజేస్తున్న ఐసీడీఎస్ పీడీ మాధురి
ఒంగోలు: సాఫ్ట్‌బాల్ బాలబాలికల జట్ల ఎంపిక ఈనెల 25న సంతనూతలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీఎస్ సుబ్బారావు, కె.వనజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14, అండర్ 17 క్రీడాజట్ల ఎంపికలో పాల్గొనేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల పరిధిలోని విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులతో సంబంధిత పాఠశాలల పీఈటీ/పీడీలు ఆన్‌లైన్ ఎంట్రీచేసి, మాన్యువల్ ఎంట్రీఫారంతో వచ్చి ఎంపికకు హాజరుకావాలన్నారు. అండర్–17 కేటగిరీలో పాల్గొనే ఇంటర్ విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, జ్ఞానభూమి చైల్డ్ ఐడీ నంబర్, సంబంధిత ప్రిన్సిపాల్ ధృవీకరణతో నిర్వాహకులకు సమర్పించి పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9100761747 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
గ్రోత్ మానిటరింగ్ నమోదు తప్పనిసరి
● ఐసీడీఎస్ పీడీ మాధురి
పొదిలి: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల గ్రోత్ మానిటరింగ్ నమోదు తప్పనిసరి అని ఐసీడీఎస్ పీడీ జి.మాధురి పేర్కొన్నారు. గురువారం స్థానిక సీడీపీఓ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందజేశారు. గ్రోత్ మానిటరింగ్ నమోదులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పోషకాహార మాసోత్సవాలను ప్రతి కేంద్రంలో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ సుధామారుతి, సూపర్‌వైజర్లు సుభాషిణి, సావిత్రి, సరిత, ప్రసన్న, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
ఎంఈఓ, హెచ్‌ఎంలపై కేసులు నమోదు
పెద్దదోర్నాల: మండల విద్యాశాఖాధికారి, చిన్నదోర్నాలకు చెందిన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై అంకమరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రామచంద్రకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ మస్తాన్‌నాయక్, ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌లు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీనికి సంబంధించి..ప్రధానోపాధ్యాయుడు తనను కులం పేరుతో దూషించి దాడి చేసినట్లు ఎంఈఓ ఫిర్యాదు చేయగా.. నాడు–నేడు పనులకు అడిగిన లంచాన్ని తాను ఇవ్వనందుకు ఎంఈఓ మస్తాన్‌నాయక్ తనపై దాడి చేశాడని ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యఐంలో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఔషధాల దుష్ప్రభావాలపై అవగాహన అవసరం
ఒంగోలు: ఔషధాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫార్మకాలజీ విభాగం అధిపతి డాక్టర్ చంద్రకళ అన్నారు. స్థానిక క్విస్ ఫార్మశీ కాలేజీలో గురువారం జరిగిన ‘ఔషధ భద్రత–ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలు నిర్థారణ’ అనే అఽంశంపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. జాతీయ ఔషధ భద్రత వారోత్సవాలలో భాగంగా నాలుగు రోజులుగా అవగాహన ర్యాలీలు, రోగులకు కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించిన క్విస్ ఫార్మశీ కాలేజీ యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని అభినందించారు. ప్రజల్లో ప్రాథమికంగా మందుల వినియోగం, తద్వారా వాటివల్ల జరిగే మేలు, దుష్ప్రభావాల పట్ల కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో ఫార్మశిస్టుల పాత్ర ముఖ్యమన్నారు. ముఖ్యంగా ఫార్మాకోవిజిలెన్స్ విభాగాల్లో ఫార్మశీ విద్యార్థులకు అపార ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. క్విస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నిడమానూరి సూర్యకళ్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రీదేవిలు మాట్లాడుతూ ఐపీజీఏ భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లో అవగాహన పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఫార్మశీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.దక్షిణామూర్తి మాట్లాడుతూ ఈనెల 23 వరకు జాతీయ ఫార్మకోవిజిలెన్స్ కార్యక్రమాలను తమ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం అంతర్జాతీయ అల్జీమర్స్‌పై అవగాహన సదస్సులో భాగంగా పోస్టర్ కాంపిటీషన్ నిర్వహించారు.

మాట్లాడుతున్న డాక్టర్ చంద్రకళ