
ఒంగోలు: గోవా నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చి వాటిపై ఆంధ్రా స్టిక్కర్లు అంటించి అక్రమంగా విక్రయిస్తున్న ఐదుగురిని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. వారితో పాటు మరో నలుగురిపై కూడా కేసు నమోదు చేశారు. వారి నుంచి మొత్తం రూ.3 లక్షల విలువైన గోవా మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. స్థానిక ఎస్‌ఈబీ కార్యాలయంలో ఏఈఎస్ ఎం.సుధీర్‌బాబు గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. నాగులుప్పలపాడు మండలం చిన్నంగారిపట్టపుపాలెం గ్రామానికి చెందిన మేకల బాబు పక్క రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చి స్థానికంగా అక్రమంగా విక్రయిస్తూ గతంలో ఒకసారి పట్టుబడ్డాడు. అప్పటి నుంచి అతనిపై ఒంగోలు ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్ బొమ్మిశెట్టి లత, ఎస్సై ఎంవీ గోపాలకృష్ణ సాంకేతికంగా నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం బాబుకు చెందిన కారులో అతని భాగస్వామి అయిన సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన అరవ పవన్ కొత్తపట్నం మండలం మడనూరు పట్టపుపాలెంలో అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఈబీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కారులో వజ్జిరెడ్డిపాలేనికి చెందిన కటారి వెంకట్రావు, టెంకాయచెట్లపాలేనికి చెందిన వాయల వెంకటేశ్వర్లు, అలగాయపాలేనికి చెందిన వాయల తిరుపతి అక్రమ మద్యం కొనుగోలు చేస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరు ముగ్గురూ వారి గ్రామాల్లో బెల్టుషాపులు కూడా నిర్వహిస్తూ అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. ఈ తనిఖీలలో ఇండికా కారులో ఉన్న 698 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. వాటిలో పలు బాటిళ్లపై అంటించిన స్టిక్కర్లు అనుమానాస్పదంగా ఉండటంతో పరిశీలించగా, గోవా నుంచి మద్యాన్ని తీసుకొచ్చి బాటిళ్లపై ఆంధ్రా స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఆ స్టిక్కర్లను సింగరాయకొండలోని ఒక స్టిక్కరింగ్‌షాపులో తయారు చేయింస్తున్నట్లు విచారణలో తేలింది. అటువంటి బాటిళ్లు 416 ఉండగా, మన రాష్ట్రంలోనే వేరే ప్రాంతంలోని షాపుల నుంచి తీసుకొచ్చి వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్న బాటిళ్లు 282 ఉండగా, మొత్తం 698 బాటిళ్లను ఎస్‌ఈబీ అధికారులు సీజ్ చేశారు. స్టిక్కర్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. గోవాలో ఫ్రాన్సిస్ అనే వ్యక్తి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేస్తుండగా, వాటిని తరలించేందుకు పొరుగు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కంటైనర్‌ను సమకూరుస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. మేకల బాబు, అరవ పవన్, కటారి వెంకట్రావు, వాయల వెంకటేశ్వర్లు, వాయల తిరుపతిని ఎస్‌ఈబీ అధికారులు అరెస్టు చేయగా, వీరితో పాటు గోవాకు చెందిన ఫ్రాన్సిస్, సింగరాయకొండలోని స్టిక్కర్ షాపు యజమాని, స్టిక్కర్లు తయారు చేసే వ్యక్తి, కంటైనర్ సమకూరుస్తున్న వ్యక్తితో కలిపి మరో నలుగురిని కూడా నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆ నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఏఈఎస్ సుధీర్‌బాబు తెలిపారు.
రూ.3 లక్షల విలువైన బాటిళ్లను సీజ్ చేసిన ఎస్‌ఈబీ ఆంధ్రా స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్టు మరో నలుగురిపై కూడా కేసు నమోదు