ఒంగోలు సబర్బన్: పొగాకు రైతులు అనధికార బ్యారన్ల నిర్మాణం చేపట్టవద్దని టుబాకో బోర్డు ఆర్‌ఎం ఎం.లక్ష్మణరావు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో గత సంవత్సరం పొగాకు మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పొగాకు రైతులు అనధికారికంగా బ్యారన్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తుందన్నారు. గత సంవత్సరం పొగాకు ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా వచ్చాయన్నారు. అయితే ఎప్పుడూ అదేవిధంగా ధరలు ఉంటాయనుకుంటే పొరపాటేనని సలహా ఇచ్చారు. పొగాకులో ధరలు శాశ్వతం కాదని, పొగాకు బోర్డు అనుమతించిన మేరకే సాగు చేపట్టాలని సూచించారు. ఈ సంవత్సరం బ్యారన్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ 2023 సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభించామన్నారు. అపరాధ రుసుం లేకుండా 2023 అక్టోబర్ 26వ తేదీ వరకు ఉంటుందన్నారు. అదేవిధంగా రూ.100 అపరాధ రుసుంతో నవంబర్ 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేస్తామని పేర్కొన్నారు. రూ.400 అపరాధ రుసుంతో నవంబర్ 10 నుంచి 20 వరకు బ్యారన్లు రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. దక్షిణ ప్రాంత తేలికపాటి నేలల్లో (ఎస్‌ఎల్‌ఎస్) బ్యారన్ ఒక్కింటికి 2.90 హెక్టార్లు (7.25 ఎకరాలు) 3,650 కేజీల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల్లో (ఎస్‌బీఎస్) బ్యారన్ ఒక్కింటికి 1.90 హెక్టార్లలో (4.75 ఎకరాలు) 3,550 కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా అనుమతి ఇస్తారని వెల్లడించారు. మొత్తం మీద ఎస్‌ఎల్‌ఎస్, ఎస్‌బీఎస్‌లలో కలిపి వచ్చే సంవత్సరానికి గాను 89.98 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా సాగు చేసుకోవాలని పొగాకు బోర్డు నిర్ణయించి అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత ఏడాది వచ్చిన పొగాకు ధరలు వచ్చే ఏడాది ఉంటాయనుకోవద్దు
ఒక్కో బ్యారన్‌కు ఎస్‌ఎల్‌ఎస్ పరిధిలో 7.25 ఎకరాలు, ఎస్‌బీఎస్ పరిధిలో 4.75 ఎకరాలు సాగు లక్ష్యం
రెండు నేలల్లో కలిపి 89.98 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి లక్ష్యం
టుబాకో బోర్డు ఆర్‌ఎం ఎం.లక్ష్మణ రావు