
అర్జీలు తీసుకుంటున్న కలెక్టర్ దినేష్ కుమార్
పొదిలి: అర్జీల పరిష్కారం బాధ్యత పూర్తిగా అధికారులదే అని కలెక్టర్ ఏ.ఎస్.దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. దర్శి రోడ్డులోని ఫంక్షన్ హాలులో బుధవారం మండల స్థాయి స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దినేష్‌కుమార్ మాట్లాడుతూ అర్జీలు ఏవిధంగా డిస్పోజల్ చేయాలనే ఆలోచనకంటే, ఏవిధంగా పరిష్కారం చేయాలో ఆలోచించాలని సూచించారు. అర్జీ ఏదశలోనూ పరిష్కారానికి నోచుకోని పక్షంలో ఆ విషయం అర్జీదారునికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీల పరిష్కారంలో జవాబుదారీతనం పెంచేందుకే మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమన్నారు. పిటీషన్లు రీ ఓపెన్ కాకుండా, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు. మండల స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరిస్తున్న తీరును నోడల్ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో స్పందన నిర్వహించామని, స్థానికంగానే సమస్యలు పరిష్కారం చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మండల స్థాయిలో స్పందన జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా ప్రతి బుధ, శుక్రవారంలలో జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళుతున్నట్లు చెప్పారు. పిటిషన్ల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
రోడ్డు ఆక్రమణలు తొలగించాలి
పాత కోర్టుకు వెళ్లే రోడ్డు 40 అడుగులు ఉండాలని, ఇరువైపులా ఆక్రమణలతో కేవలం ఆరు అడుగులకే పరిమితమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.రమణారెడ్డి, కల్లం సుబ్బారెడ్డి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలు, ఆస్పత్రులు, ఇరిగేషన్ కార్యాలయంతో పాటు ప్రకాశ్‌నగర్‌కు రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తక్షణమే రోడ్డు ఆక్రమణలను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డీఆర్‌ఓ అజయ్‌కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ బి.ఉదయ్‌కుమార్, తహసీల్దార్ అశోక్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీకృష్ణ, పలు శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ జగనన్నకు చెబుదాంలో 154 అర్జీలు