కొత్తపట్నం తీరంలో మైరెన్, పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ మలికాగర్గ్
కొత్తపట్నం: వినాయక నిమజ్జనాలు సజావుగా సాగేలా పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వర్తించాచాలని ఎస్పీ మలికాగర్గ్ దిశానిర్దేశం చేశారు. నిమజ్జన సమయంలో ఎలాంటి అపశ్రుతి, అవాంతరాలు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గణేష్ విగ్రహ నిమజ్జనాలు కొత్తపట్నం సముద్ర తీరంలో అత్యధికంగా చేయనున్న నేపథ్యంలో బుధవారం ఆమె తీరప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. తీర ప్రాంతంలో శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనాలు పూర్తి చేసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. డీజే సౌండ్ వాహనాలను తీరం దగ్గరకు రానీయకుండా పార్కింగ్ చేయాలని ఆదేశించారు. అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలువలు, చెరువుల వద్ద నిమజ్జనాల సమయంలో ప్రమాదాలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. వాహనాల దారి మళ్లింపు, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, భక్తుల భద్రతా నియమావళిపై ఫ్లెక్సీలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీకి స్థానిక పోలీసులు వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసు, ఒంగోలు టూటౌన్ సీఐ జగదీష్, ఎస్సై బి.సాంబశివరావు, మైరెన్ ఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు
గణేశ్ నిమజ్జనాలు సజావుగా సాగాలి
బీచ్‌లో సాయంత్రం 6 గంటల వరకే విగ్రహాలకు అనుమతి
ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల
పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు
కొత్తపట్నం బీచ్‌లో పర్యటించిన
ఎస్పీ మలికాగర్గ్
పోలీస్ అధికారులు, సిబ్బందికి
దిశానిర్దేశం


