సింగరాయకొండ(టంగుటూరు): తన కుమార్తె వెంట పడి రోజూ వేధిస్తున్న యువకులను పద్ధతి మార్చుకోవాలని సూచించిన వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన కేసులో ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ దాచేపల్లి రంగనాథ్ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. సీఐ మాట్లాడుతూ.. దాడి కేసులో ప్రధాన నిందితుడు బొజ్జా మహేష్ పరారీలో ఉన్నాడని, అతని స్నేహితుడు ఆటో డైవర్ సదానందంను బైరాగి మాన్యంలో బుధవారం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మహేష్‌ను త్వరలో పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్సై టి.శ్రీరామ్ పాల్గొన్నారు.