బహిరంగ సభలో మాట్లాడుతున్న మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్
కనిగిరి రూరల్: కనిగిరి ప్రాంత ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం నదీ జలాలతోనే సాధ్యమని మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్‌ఆర్‌కేఆర్ విజయ్‌కుమార్ అన్నారు. ఐక్యతా విజయ పథం యాత్రలో భాగంగా సోమ, మంగళవారాల్లో ఆయన కనిగిరిలో పర్యటించారు. సోమవారం స్థానిక పామూరు బస్టాండ్ సెంటర్ వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ప్రజలకి దగ్గరగా పని చేసిన సందర్భాలు గుర్తు వస్తున్నాయని, ప్రజావాణి, అక్షర విజయం ద్వారా ప్రజలకి దగర అయ్యానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి అనేక చర్యలు తీసుకున్నామని, అనేక పరిశోధనల తర్వాత నది జలాల పంపిణీ మాత్రమే పరిష్కారానికై ఏకై క మార్గం అని పేర్కొన్నట్లు చెప్పారు. వివేకాం ఫౌండర్ ప్రెసిడెంట్ విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నో కిలో మీటర్లు దాటుకొని యాత్ర కనిగిరికి వచ్చిందని, విశేష ప్రజాదారణ లభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి చోట అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.
షాదీఖానాలో ముస్లిం ఆత్మీయ సదస్సు
అనంతరం స్థానిక షాదీఖానాలో మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ గఫార్ అధ్యక్షతన ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాజీ కలెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏదో ఒక కారణం చూపి కొందర్ని దోషులుగా చూపే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష ప్రసంగాల పట్ల ఎంతో అప్రమత్తత అవసరం అని స్పష్టం చేశారు. ఏదో కారణాలతో చట్టాలు తెచ్చి వాటిలో కొన్నింటిని మైనారిటీలపై ఎక్కు పెట్టే దురుద్దేశాలను ఐక్యతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మైనార్టీ వర్గాలు ఉన్నత విద్యావంతులుగా మారాలని ఆకాంక్షించారు. ముస్లిం మైనార్టీల్లో అక్షరాస్యత పెరగాలని పిలుపునిచ్చారు. తొలిరోజు యాత్రకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, మహిళ సంఘాలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, ఏపీ ఎంసీ సభ్యుడు డాక్టర్ పెరుగు మురళికృష్ణ, కౌన్సిలర్లు, విశ్రాంత ఎంఈఓ మస్తాన్ వలి, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎస్‌కే ఖాశిం సాహెబ్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్
ముస్లిం మైనార్టీల్లో అక్షరాస్యత పెరగాలి
విద్యతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల
అభివృద్ధి సాధ్యం
ఐక్యతా విజయ పథం యాత్రకు విశేష స్పందన


