నియామక పత్రాలు అందజేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు: కారుణ్య నియామకం కింద జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలో నలుగురికి ఉద్యోగ నియామక ఉత్తర్వులను జెడ్పీచైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో బి.జాలిరెడ్డిలు మంగళవారం జెడ్పీ కార్యాలయంలో అందించారు. జూనియర్ సహాయకులుగా టీపీఎల్ శివనాగప్రసాద్(ఉలవపాడు మండలం చాకిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), యం.గిరిజ (బేస్తవారిపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల), ఆఫీస్ సబార్డినేట్‌లుగా టి.వెంకట శేషమ్మ (ఒంగోలు ఎంపీడీవో కార్యాలయం), యస్.సందీప్ (కొరిశపాడు ఎంపీడీవో కార్యాలయం) ఈ ఉత్తర్వులు అందుకున్నారు.
పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డి సస్పెన్షన్
ఒంగోలు: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
23న జిల్లా స్థాయిలో సైన్స్ సెమినార్
ఒంగోలు: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం (ఎన్‌సీఎస్‌ఎం, బెంగళూరు విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం (వీఐటీఎం)లు జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ సెమినార్ జిల్లా స్థాయి పోటీలు ఈనెల 23న స్థానిక పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిల్లెట్స్– ఏ సూపర్ ఫుడ్ లేదా ఏ డైట్ ఫుడ్ అనే అంశంపై సెమినార్ జరుగుతుందన్నారు. దీనికి 8, 9, 10 తరగతుల విద్యార్థులు అర్హులు. సెమినార్‌లో ఒక్కో విద్యార్థికి 5 నిముషాల సమయం కేటాయిస్తారని, పోటీలో పాఠశాల నుంచి ఒక విద్యార్థి పాల్గొని గరిష్టంగా 5 పోస్టర్లు/చార్టులు, పీపీటీ స్లైడ్ సాయంతో అంశాన్ని ఆంగ్లం లేదా తెలుగులో వివరించాల్సి ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమస్థానం పొందిన విద్యార్థి రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని, పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి టి.రమేష్, సెల్ నంబర్ 9666955504ను సంప్రదించాలన్నారు.
ప్రైవేటు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలి
ఒంగోలు: 2024 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే ప్రైవేటు విద్యార్థులు (2023 ఏప్రిల్/ జూన్ లో జరిగిన పరీక్షలలో తప్పిన విద్యార్థులు) పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజును ఈనెలాఖరులోగా అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో అక్టోబరు 5వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుంతో అక్టోబరు 11వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో అక్టోబరు 16వ తేదీ వరకు ఫీజును సీఎఫ్‌ఎంఎస్ ద్వారా చెల్లించాలన్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ లింకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని, ప్రధానోపాధ్యాయులు తమకు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డు ద్వారా లాగిన్ కావాలన్నారు. మూడు సబ్జక్టుల వరకు రూ.110, మూడు సబ్జక్టులకు మించితే రూ.125, మైగ్రేషన్ సర్టిఫికెట్ అవసరమైతే రూ.80 చెల్లించాలన్నారు.
డీసీఈబీ కాంట్రిబ్యూషన్‌ను 30లోగా చెల్లించాలి
ఒంగోలు: జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్స్ ఈ ఏడాది జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ప్రశ్నపత్రాల కోసం చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్‌ను ఈనెల 30వ తేదీలోగా చెల్లించాలని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు అధ్యక్షుడు వీఎస్ సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల స్ట్రెంథ్ ఫారం, బ్యాంకు కౌంటర్ ఫైల్, పాఠశాల రికగ్నీషన్ కాపీ జతచేసి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యాలయం, ఒంగోలుకు పోస్టు చేయడం లేదా స్వయంగా సమర్పించాలన్నారు. ఈనెలాఖరులోగా డీసీఈబీ కాంట్రిబ్యూషన్ చెల్లించకపోతే అపరాధ రుసుముతో కలిపి చెల్లించాల్సి ఉంటుందన్నారు.


