ప్రాజెక్టును గాలికొదిలేసిన బాబు:
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2014 నుంచి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కంటి తుడుపుగానే నిధులిచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిపుణుల కమిటీ గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్దకు వచ్చి 2016లో పరిశీలన చేశారు. నిపుణుల సిఫార్సుల మేరకు స్పిల్ వే గేట్ల గడ్డర్లు, ప్లేట్లు, గేటు పరికరాలు బలోపేతం చేయాలని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించారు. స్పిల్ గేట్ల నిర్వహణ కూడా చేపట్టాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తోట నిర్వహణ, ప్రాజెక్టు సందరీకరణ పేరుతో నిధులు మంజూరు చేశారు. టీడీపీ నాయకులు మాత్రం వాటిని కూడా తూ..తూ మంత్రంగా పనులు చేపట్టి వచ్చిన నిధులను దోచుకున్నారు. ప్రాజెక్టు పేరుతో ఆర్ధికంగా లబ్ధి పొందేందుకు జీఓ నంబర్ 22ను తెరపైకి తెచ్చారు. తద్వారా పెద్ద ఎత్తున నిధులు బొక్కేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం 2016 జూన్‌లో ప్రాజెక్టు అంచనాలను రూ.768.18 కోట్లకు పెంచారు. అయితే అప్పట్లో విమర్శలు రావటంతో కనీసం ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించనే లేదు.
టీడీపీ పాలకుల నిర్లక్ష్యంతోనే
కొట్టుకుపోయిన 3వ గేటు:
గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల నిర్వహణ కోసం టీడీపీ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించారు. అయితే ఆ నిధులు గేట్ల మరమ్మతుల కోసం కాకుండా ప్రాజెక్టు సుందరీకరణ కోసం ఖర్చు చేశామని చెబుతున్నారు. దాదాపు రూ.3 కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తే వాటిని గేట్ల మరమ్మతులకు కేటాయించకుండా గేట్ల నిర్వహణను గాలికి వదిలేయటం వల్లనే మూడో గేటు కొట్టుకుపోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహణ పనులు గాలికి వదిలేసిన నాయకులు ఒక గేటు కొట్టుకుపోయేసరికి గగ్గోలు పెట్టారు.