
వినాయక చవితి పండుగకు ఆరు నెలల ముందు నుంచే ప్రతిమల తయారీకి సిద్ధమవుతారు. విగ్రహాల తయారీకి అవసరమైన ముడి సరుకును హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటారు. అంతేకాకుండా అత్యంత ఆకర్షణీయంగా రూపొందించేందుకు అవసరమైన వివిధ రూపాల అచ్చులను సైతం హైదరాబాద్ నుంచే అద్దె ప్రాతిపదికన తెచ్చుకుంటారు. ఆరు నుంచి పది అడుగులు ఉండే విగ్రహాలను రోజుకు ఎనిమిది లేదా పది తయారు చేస్తారు. రూపాన్ని బట్టి అచ్చులకు రోజువారీ అద్దె చెల్లిస్తారు. ఒక్కో అచ్చుకు సుమారు రూ.10 వేలు చెల్లిస్తున్నారు.
విగ్రహాలను వేగంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్‌లోనే ఉంటున్న రాజస్థాన్ కళాకారులను నియమించుకుని రోజు ప్రాతిపదికన వారికి కూలి ఇస్తారు. కిరీటాలు, చేతులు, తొండాలు ఇలా అన్నీ విడివిడిగా పోత పోస్తారు. అవి బాగా ఆరాక క్రమ పద్ధతిలో అతికించి, ఇట్టే ఆకట్టుకునేలా తుదిమెరుగులు దిద్దుతారు. చివరగా స్ప్రేయర్‌తో రంగులు వేసి విగ్రహాలను ముస్తాబు చేస్తారు. మామూలుగా అయితే ఒక విగ్రహం తయారీకి సుమారు పది రోజుల సమయం పడుతుంది. భారీ పరిమాణంలో విగ్రహాలకు సంబంధించి ఒకేసారి అచ్చులతో ఎనిమిది నుంచి తొమ్మిది విగ్రహాల తయారీకి రంగం సిద్ధం చేస్తారు.