
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది లక్షాధికారులు కావాలన్న ఆలోచనతో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు దఫాలుగా రుణమాఫీ చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో రూ.558.84 కోట్లు జమచేయగా మూడో విడత ఈ నెల 25వ తేదీన మరో రూ.279 కోట్లు మహిళల ఖాతాలో జమచేయనున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మహిళలు స్వశక్తితో...తలెత్తుకొని జీవించేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దూసుకుపోతోంది. మహిళలు స్వయం శక్తిగా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం. ప్రజా సంకల్ప యాత్రలో మహిళలు పడుతున్న కష్టాలను కళ్లారా చూసి చలించిన వైఎస్ జగన్ ఎన్నికల హామీల్లో భాగంగా నవరత్నాలను ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట కోసం డ్వాక్రా రుణమాఫీ పథకాన్ని నవరత్నాల్లో చేర్చారు.
నాడు బాబు మోసం.. నేడు జగన్ వరం
2014లో ఎన్నికల ముందు.. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏ ఒక్కరూ డ్వాక్రా రుణం చెల్లించాల్సిన అవసరం లేదని నమ్మకంగా చెప్పారు. దీంతో మహిళలు ఆ రుణాలు చెల్లించలేదు. ఆ తర్వాత ఆయన అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేయకుండా మోసం చేశారు. దీంతో మహిళల అప్పు.. వడ్డీతో కలిపి చెల్లించలేనంతగా పెరిగిపోయింది. దీంతో బ్యాంకు అధికారుల వేధింపులకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పడిన బాధలు, అవమానాలు అంతా...ఇంతా కాదు. ఇళ్లకు బ్యాంకు వాళ్లు వచ్చి ఇళ్లు వేలం వేస్తామని నోటీసులు కూడా అంటించారు. చంద్రబాబు చేసిన నయ వంచన డ్వాక్రా మహిళల పాలిట శాపంగా మారింది. తన పాదయాత్రలో డ్వాక్రా అక్కచెల్లెమ్మల బాధలు కళ్లారా చూసిన వైఎస్ జగన్ 2019 సాధారణ ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ‘వైఎస్సార్ ఆసరా’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇది తమకు నిజంగా వరం అని రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రెండు విడతల్లో
రూ.558.84 కోట్ల రుణ మాఫీ:
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు స్టేట్ లెవల్ బ్యాంకింగ్ కమిటీ ఇచ్చిన రుణాల జాబితా ప్రకారం రుణాలు మాఫీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకూ రెండు విడతల్లో జిల్లాలోని డ్వాక్రా మహిళలకు రూ.558.84 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ప్రతి విడతలోనూ 3,58,732 మంది మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది.
ఈ నెల 25న మూడో విడత నగదు జమ:
అనుకున్న ప్రకారం వైఎస్సార్ ఆసరా పథకం కింద ఈ నెల 25వ తేదీన మూడో విడత నగదు జమ కానుంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా డ్వాక్రా మహిళల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 36,709 డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 3,58,732 మంది డ్వాక్రా మహిళలకు రూ. 279.42 కోట్లు జమ కానున్నాయి.
26వ తేదీ నుంచి ఆసరా సంబరాలు
ఈ నెల 26వ తేదీ నుంచి మారుమూల గ్రామం మొదలుకొని మండల కేంద్రం, పట్టణం, నగరం వరకు వాడవాడలా ఆసరా సంబరాలు జరగనున్నాయి. డ్వాక్రా అక్కచెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడటానికే ఈ వైఎస్సార్ ఆసరా సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్ ఆసరాకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ఉంచారు. మార్చి 14 నుంచి 24వ తేదీ వరకు సిబ్బంది సభ్యుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 25న డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు. ఆ తర్వాత సంబరాలు నిర్వహించనున్నారు.
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దటానికే
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదద్దటానికి ఈ వైఎస్సార్ ఆసరా ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్వాక్రా రుణాల మాఫీ వలన వచ్చే నగదును వృథా చేయకుండా చిరు వ్యాపారాలు చేసుకునేలా తీర్చిదిద్దుతున్నాం. పాడి పరిశ్రమతో పాటు చిరు వ్యాపారాలు చేసుకొని జీవన ప్రమాణాలను పెంపొందించుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.
– బి.బాబూరావు, పీడీ, డీఆర్‌డీఏ
‘‘వైఎస్సార్ ఆసరా’’ మహిళలకు వరం స్వయం శక్తిగా ఎదిగేందుకు ప్రభుత్వ తోడ్పాటు ఈ నెల 25న మూడో విడత జిల్లాలో రూ.279.42 కోట్ల నగదు జమ రెండు విడతల్లో రూ.558.84 కోట్ల రుణాల మాఫీ జిల్లాలో 3,58,732 మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి

డ్వాక్రా గ్రూపు సభ్యురాలికి ఆసరా నగదు వివరాలు వెల్లడిస్తున్న మెప్మా సీసీ
