
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే కదా. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. వివేక కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేబినెట్ సమావేశాలు కామెడీ సమావేశాలుగా మారిపోయాయి. కేబినెట్ సమావేశాలు అనగానే అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. తమకు మేలు చేకూరే అంశాలపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమోనని అనుకుంటారు. కానీ, చంద్రబాబు కేబినెట్‌కి వైఎస్ జగన్ అంటే భయం పట్టుకుంది. పదే పదే జగన్ చుట్టూ చర్చిస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి కూడా చర్చించే స్థాయికి దిగజారారు.
చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యల గురించి కూడా సమీక్షలు నిర్వహించాలి. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే జగన్ కుటుంబానికి ఏం సంబంధం?. వైఎస్ జగన్‌ని అవమానపరిచే కుట్ర కాదా ఇది?. ఆయన చెల్లెళ్లను కూడా తన రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని చీల్చటానికి చంద్రబాబు చేసిన కుట్ర ఇది.
వివేకానంద రెడ్డిని నేనే చంపానని దస్తగిరి పదేపదే చెప్పాడు. మరి అతనికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతున్నదెవరో చంద్రబాబు సమీక్ష చేయాలి. మల్లెల బాబ్జీ హత్య నుండి వినుకొండ రషీద్ హత్య వరకు అన్నింటిపై చర్చిద్దాం. వీటిపై ఏ వేదిక మీద చర్చించటానికైనా మేము సిద్ధమే. బాలకృష్ణ కుటుంబంలో జరిగిన కాల్పుల గురించి కూడా చర్చిద్దాం. ఆయన వాచ్‌మెన్ ఎలా చనిపోయాడో కూడా చర్చిద్దామా?. హరికృష్ణ రోడ్డు ప్రమాదం, నారా రామ్మూర్తి నాయుడు పిచ్చివాడు కావటం, తారకరత్న హఠాన్మరణం గురించి కూడా చర్చించాలి. వీటన్నిటిపై చంద్రబాబు సమీక్ష చేయాలి.

వివేకా కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే. వివేకా అధికారికంగా పెళ్లి చేసుకున్న షమీమ్ ఫోన్ ఎక్కడ ఉంది?. అందులోని వాట్సప్ చాటింగ్‌ని ఎందుకు డిలిట్ చేశారో కూడా తేల్చాలి. ఈసీ గంగిరెడ్డి, డ్రైవర్ నారాయణ, అభిషేక్‌రెడ్డి అనారోగ్యంతో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారా?. హత్యా రాజకీయాలు మాపై రుద్దాలనుకుంటే కుదరదు. ఆ పాపాలే మీకు శాపాలై ఉరితాళ్లుగా మారతాయి’ అంటూ హెచ్చరించారు.