
సాక్షి, తాడేపల్లి: సంబంధం లేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైయస్ జగన్‌ను ఏ1 నిందితుడు అంటూ ఈనాడు పత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆనందం కోసం రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ జర్నలిజాన్ని సమాధి చేస్తూ, వైఎస్సార్‌సీపీ పైన తప్పుడు రాతలు రాయడమే ఈనాడు లక్ష్యం అన్నట్లుగా పత్రికను నడుపుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ నిందితుడుగా ఉన్నట్లు ఒక్క ఆధారమైనా చూపగలరా అని ప్రశ్నించారు. న్యాయవాది, వ్యాపారిగా ఉన్న సునీల్ రెడ్డిని వైఎస్ జగన్‌కు సన్నిహితుడని, లిక్కర్ స్కాంలో నిందితుడుగా ఉన్నాడంటూ అర్థం లేకుండా పిచ్చిరాతలు రాసిన ఈనాడు ఒక్కసారైనా ఆయన గత ఐదేళ్లలో ఇక్కడకు వచ్చినట్లు, ఏదైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు నిరూపించగలరా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..
‘‘ఎల్లో మీడియా ఈనాడులో బేతాళ కథల మాదిరిగా రోజుకో కొత్త కథను లిక్కర్ స్కాం అంటూ వండి వారుస్తున్నారు. వైఎస్ జగన్‌తో ఎవరైతే సన్నిహితులుగా ఉన్నారో వారిని అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ఈనాడు పత్రిక బాకా ఊదుతోంది. అన్ని విలువలను వదిలిపెట్టి, బురదచల్లడమే జర్నలిజంగా తన విధానాన్ని మార్చుకుంది. గతంలో రామోజీరావు ఉన్నప్పుడు ఎలా భజనచేశారో, దానికి మించి ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్ మొత్తం పత్రికనే చంద్రబాబు పాదాక్రాంతం చేస్తూ, అత్యంత నీచమైన స్థాయికి దిగజారిపోయి, అబద్ధాలు, అభూతకల్పనలతో కథనాలను రాస్తున్నారు.
..దీనిలో భాగంగానే వైఎస్ జగన్‌కు నమ్మినబంటు, ఎమ్మార్ ప్రాపర్టీలో నిందితుడు సునీల్ రెడ్డి లిక్కర్ స్కాంలో కీలకం అంటూ ఒక కథనాన్ని వండివార్చారు. ఈ కథనంలో సునీల్ రెడ్డి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఏ7 అయితే, దీనిలో వైఎస్ జగన్ ఏ1 అంటూ తన కథనంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ రాశారు. ఈనాడు కిరణ్ తన పత్రికను జర్నలిజం ప్రకారం నడుపుతున్నారా? లేక తన బ్రోకరిజం పాలసీ మేరకు నడుపుతున్నారా? ఎమ్మార్ కేసులో వైయస్ జగన్‌కు ఏం సంబంధం? కోర్టులో ఉన్న రికార్డుల ప్రకారం ఈ కేసులో ఏ1 బిభూ ప్రసాద్ ఆచార్య. అసలు ఈ కేసులో వైఎస్ జగన్ పేరు ఎక్కడ ఉందో చూపగలరా?
..కనీస అవగాహన లేకుండా తప్పుడు కథనం రాశామని, మరుసటి రోజు అయినా సవరణ వేస్తారని చూశాం. కానీ వారి వైఖరి చూస్తుంటే, కావాలనే వైఎస్ జగన్‌పై బురదచల్లేందుకే ఈ కథనం రాశారని అర్థమవుతోంది. పైగా ఇదే కథనంలో వైఎస్ జగన్‌కు సునీల్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అంటూ రాశారు. సునీల్ అనే వ్యక్తి న్యాయవాది, వ్యాపారి. ఏనాడైనా ఆయన గత అయిదేళ్ళలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉండగా ఇక్కడకు వచ్చారా? ఎక్కడైనా ఏదైనా వ్యవహారంలో జోక్యం చేసుకున్నారా? సూట్‌కేసు కంపెనీలను ఏర్పాటు చేశాడంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా ఆరోపణలు చేశారో ఈనాడు పత్రిక చెప్పాలి.
..అత్యంత సన్నిహితుడు అంటే చంద్రబాబుకు నిత్యం భజన చేస్తూ పత్రికను నడిపించిన రామోజీరావు, ఆయన మరణం తరువాత ఆ స్థానంలో ఉన్న చెరుకూరి కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు. వీరు కదా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. సునీల్ రెడ్డి నివాసంలో సిట్ జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు దొరికాయని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు దొరికాయంటూ ఈనాడులో రాశారు. సిట్‌లోని ఏ అధికారి కీలక ఆధారాలు దొరికాయని చెప్పారో వెల్లడించాలి.
..గతంలో ఇదే లిక్కర్ స్కాంలో బంగారం, విదేశాల్లో ఫ్యాక్టరీలు, దుబాయ్‌లో ఆస్తులు ఇలా అనేక రకాలుగా ఊహాత్మక అంశాలను వార్తా కథనాలుగా రాశారు. ఈనాడు ఇలా దిగజారిపోయి రాస్తున్న తప్పుడు రాతలను చూస్తే, చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం జర్నలిజం విలువలను సమాధి చేసి, భజన చేయడమే తమ జీవితాశయంగా పత్రికను నడుపుతున్నారని అర్థమవుతోంది. లేని లిక్కర్ స్కాంలో వైఎస్ జగన్‌ను దోషిగా చూపాలన్నదే వారి తాపత్రేయంగా కనిపిస్తోంది.
..ఈనాడు పత్రిక పేరును చంద్రనాడు అని మార్చుకుంటే బాగుంటుంది. ఇటువంటి తప్పుడు వార్తను ప్రచురించినందుకు ఈనాడు పత్రిక నిర్వాహకుడు చెరుకూరి కిరణ్ క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే ఈనాడు పత్రికను ప్రజలు టిష్యూ పేపర్‌గా చూస్తున్నారు. దానిని టాయిలెట్ పేపర్ స్థాయికి తీసుకువెళ్ళేందుకు ఈనాడు కిరణ్ కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అబద్దపు రాతలపై చర్యలు తీసుకుంటామంటున్న సీఎం చంద్రబాబు, తన నమ్మినబంటు చెరుకూరి కిరణ్ ఈనాడులో రాస్తున్న అసత్య కథనాలపై కూడా చర్యలు తీసుకోవాలి’’ అని పుత్తా శివశంకర్ రెడ్డి పేర్కొన్నారు.