
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. ఒక గ్రామంలోని ఓట్లను మరో గ్రామంలోకి వెళ్లి ఓటేసేలా చేయడం వెనుకు ప్రభుత్వం కుట్ర దాగి ఉందని విమర్శించారు.
ఒక గ్రామంలో ఓట్లు మరో గ్రామానికి వెళ్లి వినియోగించుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 9వ తేదీ) మాట్లాడిన రాచమల్లు.. ‘వింత పోకడలకు చంద్రబాబు ప్రేరేపిస్తే, ఎన్నికల కమిషన్ సహకరిస్తోంది. చంద్రబాబు ఇగోను సంతృప్తిని పరచడానికి పోలీస్ శాఖ పని చేస్తుంది. మేము శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు కోరుకుంటున్నాం.
మాపై మేము దాడులు చేసుకోవడానికి మాకు పిచ్చి, వెర్రి లేదు. వైఎస్సార్‌సీపీకి సంబంధించిన చివరి కార్యకర్తలను అరెస్టు చేసినా మేము భయపడం. మా పార్టీ మహిళలు బూత్‌కు వెళ్లి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాడులు, విధ్వంసాలతో నెగ్గాలి అనుకోవడం కుటిల ఆలోచన. 12వ తేదీ పులివెందుల రూరల్ ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టడం ఖాయం’ అని రాచమల్లు సృష్టం చేశారు.