
ఈనాడు రోత రాతలపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రోత రాతలపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. వైఎస్ జగన్ లక్ష్యంగా ఈనాడు విషపు రాతలు రాస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షిగా ఉన్నారని ఈనాడు రోత రాతలు రాసింది. కేబినెట్‌లో చంద్రబాబు ఏదో మాట్లాడితే.. ఈనాడు తప్పుడు వార్తలు వండి వార్చింది. వివేకా వాచ్‌మెన్ రంగయ్య మృతిని కూడా వైఎస్ జగన్‌కు ఆపాదించే యత్నం చేసింది. హామీలు అమలు గురించి తప్పించుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ పేర్ని నాని నిప్పులు చెరిగారు.
‘‘డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు.. ఎన్నికలయ్యాక చేతులెత్తేశారు. రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు వార్తలు రాయించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్ పరపతిని కూడా ఈనాడును అడ్డంపెట్టకుని బాబు దెబ్బతీశాడు. గతంలో లక్ష్మీపార్వతిపై కూడా ఈనాడులో ఇలాగే తప్పుడు రాతలు రాయించారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈనాడును చంద్రబాబు వాడుతున్నారు. వైఎస్ వివేకా హత్యతో వైఎస్ జగన్‌కు ఏం సంబంధం?. వ్యవస్థలను ప్రభావితం చేసి వైఎస్సార్‌సీపీ నేతలను బాబు ఇబ్బంది పెట్టాలని చూశారు’’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.
‘‘వైఎస్ జగన్, వైఎస్ అవినాష్‌రెడ్డిలపై విషం చిమ్మడమే చంద్రబాబు లక్ష్యం. న్యాయ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేలా ఈనాడులో వార్తలురాస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రంగన్న మృతిని కేబినెట్‌లో చర్చించారు. నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి చెందారు. గంగాధర్‌రెడ్డిది సహజ మరణమని పోస్టుమార్టం రిపోర్ట్ చెప్తుంది. గంగాధర్‌రెడ్డి మరణం అనుమానం అంటూ బాబు డైరెక్షన్‌లో ఈనాడు తప్పుడు రాతలు రాసింది. గన్‌మెన్లు ఉండగా రంగన్న మృతిపై చంద్రబాబుకు సందేహం ఏంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ఇచ్చిన గన్‌మెన్లు ఉండగా.. రంగన్న మృతి ఎలా అనుమానాస్పదం?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
‘‘పరిటాల మృతి తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. 2014- 2019 మధ్య పరిటాల సునీత కూడా మంత్రిగా ఉన్నారు. పరిటాల రవి హత్యపై ఎందుకు విచారణ చేయలేదు. వివేకా హత్య కేసులో నారాయణ సాక్షి కాదని రికార్డులు చెప్తూ ఉంటే.. నారాయణ సాక్షి అని ఈనాడు ఎలా రాస్తోంది?’’ పేర్ని నాని నిలదీశారు.

‘‘వివేకా హత్య కేసులో ఈనాడు తప్పుడు వార్తలు రాసింది. సుగాలి ప్రీతి హత్య కేసు గురించి తీవ్రంగా పరిగణించరుగానీ రంగయ్య మృతిపై మాత్రం తీవ్రంగా స్పందిస్తారంట. జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్ ఆ కేసులో సాక్షి అంటూ తప్పుడు కథనాలు రాశారు. జగన్ లక్ష్యంగా విషపు రాతలు రాసింది. చంద్రబాబువి.. తప్పుడు మాటలు, ఈనాడువి తప్పుడు రాతలు. కేబినెట్‌లో ప్రజలకు చేయాల్సిన మేలు గురించి చర్చించలేదు. ఎన్నికలలో ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తారు. అధికారంలోకి వచ్చాక తన తప్పుడు హామీల నుండి బయట పడటానికి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. హామీలకు పంగనామాలు పెట్టారు.
..రాజకీయ ప్రత్యర్థులపై ఈనాడులో విషం కక్కించటం చంద్రబాబుకు అలవాటే. ఎన్టీఆర్ కు వెన్నుపోటు నుండి అనేక అంశాలలో ఇదే జరిగింది. లక్ష్మీ పార్వతి విషయంలో కూడా అప్పట్లో ఇలాగే రాయించారు. అవినాష్ కు సంబంధం లేకపోయినా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేలాగ పెద్దపెద్ద అక్షరాలతో వార్తలు రాయిస్తున్నారు. నారాయణకు వివేకా కేసుకు ఎలాంటి సంబంధం లేదు. బ్రెయిన్ ట్యూమర్ తో నారాయణ చనిపోయారు. కల్లూరి గంగాధరరెడ్డిని 243వ సాక్షిగా ఉన్నాడు. దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో మృతి చెందారు. ఆయనది సహజ మరణం అని పోస్టుమార్టం రిపోర్టు కూడా ఉంది. శ్రీనివాసరెడ్డి 2018 సెప్టెంబరు లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు
..వైఎస్ అభిషేక్‌రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. జగన్, సునీతమ్మ ఇద్దరికీ అభిషేక్ బంధువే. మల్టీ ఆర్గన్స్ డేమేజ్ వలన అభిషేక్ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసినా ఈనాడు విషపు రాతలు రాసింది. వాచ్‌మెన్ రంగన్నకు పోస్టుమార్టం అయ్యాక ఖననం చేశారు. రంగన్న గురించి కేబినెట్‌లో చర్చించారు. డీజీపీతో పాటు కడప నుండి పోలీసు అధికారులు వచ్చి ప్రభుత్వ పెద్దల సందేశం తీసుకుని వెళ్లారు. రంగన్నకు 2+2 గన్ మెన్‌లతో జగన్ ప్రభుత్వం భద్రత కల్పించారు. చంద్రబాబు వచ్చాక 1+1 భద్రతకు తగ్గించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన గన్‌మెన్ ఉండగా ఎలా అనుమానాస్పదంగా రంగన్న మృతి చెందారు?. ఖననం చేసిన రంగన్న మృతదేహాన్ని మళ్ళీ బయటకు తీసి రీపోస్టుమార్టం చేస్తున్నారు. ఆ నివేదికలు రాకముందే ఈనాడులో తప్పుడు కథనాలు ఎలా రాశారు?
..పరిటాల రవి హత్యలో సాక్షుల మృతిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపలేదు?. ఎప్పుడో చనిపోయిన నారాయణ యాదవ్ మృతితో సహా అందరిపై విచారణ చేస్తారట, ఎవరిని ఇరికించటానికి విచారణల పేరుతో వ్యవస్థలను నాశనం చేస్తారు?. ఎన్నికల హామీలను డైవర్షన్ చేయటానికి ఇలాంటి తప్పుడు వార్తలు, తప్పుడు విచారణలు చేయిస్తున్నారు. రంగన్న ఇచ్చిన 164 స్టేట్‌మెంటులో అవినాష్ రెడ్డి పేరు లేదు. అసలు ఏ సాక్షి కూడా అవినాష్ పేరు చెప్పలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాసే విష సంస్కృతి మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు.