అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్‌: మార్గాని భరత్‌ | YSRCP Leader Margani Bharat Reacts On AP Budget 2025-26, More Details Inside | Sakshi
Sakshi News home page

అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్‌: మార్గాని భరత్‌

Mar 1 2025 2:41 PM | Updated on Mar 1 2025 4:03 PM

Ysrcp Leader Margani Bharat Reacts On Ap Budget

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆక్షేపించారు.

సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్‌ రూపొందించారని, ఇదంతా సూపర్‌ సిక్స్‌ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన  ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్‌ చెప్పారు.

మార్గాని భరత్‌ ఇంకా ఏమన్నారంటే..:

ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:
అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్‌ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్‌ సిక్స్‌ హామీలకు సంబంధించిన బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్‌ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.

మాటలకు చేతలకు పొంతన లేదు:
అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్‌ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్‌ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్‌ ప్రసంగంలో పయ్యావుల కేశవ్‌ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.

పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:
పెయిడ్‌ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్‌ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్‌ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.

పథకాలన్నీ నిర్వీర్యం:
ఎన్టీఆర్‌ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్‌ నుంచి ఇన్సూరెన్స్‌ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్‌ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్‌ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్‌ గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement