‘మహానాడుకు ఉద్యోగుల తరలింపులేంటీ?’ | YSRCP Leader Chandrasekhar Reddy Slams Chandrababu Over Mahanadu For Using Employees | Sakshi
Sakshi News home page

‘మహానాడుకు ఉద్యోగుల తరలింపులేంటీ?’

May 29 2026 5:17 PM | Updated on May 30 2026 3:27 PM

YSRCP Leader Chandrasekhar Reddy Slams Chandrababu Over Mahanadu

తాడేపల్లి:  ప్రభుత్వ ఉద్యోగుల్ని టీడీపీ కార్యకర్తల్లా మహానాడుకు తీసుకెళ్లి పచ్చ కండువాలు వేసి కూర్చోబెట్టడం ఏంటని వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి సర్కారును ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం, వాళ్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా తిప్పుకుంటుందని ప్రశ్నించారు.  నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాలకే ఉద్యోగుల నియమావళి పేరు చెప్పి చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారశైలి ఉందని చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. 

టీడీపీ కార్యకర్తలతో మహానాడు మీటింగ్ పెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లే రోగులకు ఆటంకాలు కల్పించారు. మీ పార్టీ కార్యకర్తలతో పార్టీ కార్యాలయాల్లోనో, ప్రైవేటు ఫంక్షన్ హాల్స్ లో ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాలే తప్ప, ప్రభుత్వ ఆస్పత్రులు, గుళ్లు, గోపురాల దగ్గర మీటింగులు పెట్టుకోవడం పద్ధతి కాదు. ఆస్పత్రుల ప్రాంగణాలను వాడుకుంటూ, ఉద్యోగుల్ని కూడా సభల్లో కూర్చోబెడుతున్నారు. 

వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులా, మీ పార్టీ కార్యకర్తలా అని అడుగుతున్నాను. తాజాగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఓ గ్రామంలో ఓ ఎస్సై దర్జాగా మహానాడు స్టేజ్ మీద కూర్చొన్నాడు. ఇదేమైనా అధికారిక కార్యక్రమమా ? టీడీపీ సమావేశాల్లో పాల్గొంటే ఉద్యోగులకు నిబంధనలు వర్తించవా ? ఉద్యోగుల్ని ప్రతిసారీ ఇలాగే రాజకీయ కార్యక్రమాలకు ప్రభుత్వం వాడుకుంటోంది. 

గతంలో కడపలో మహానాడు జరిగినప్పుడు కూడా వీఆర్వోల్ని కూడా తెచ్చి కూర్చొబెట్టారు. అప్పట్లో టెంట్లు గాలికి కూలిపోయి వాళ్లంతా గాయపడ్డారు. అప్పట్లోనే మేం ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించాం. గతేడాది కడప మహానాడులో డీఎం అండ్ హెచ్వోను సైతం మెడలో పసువు ట్యాగ్ లు వేసి మరీ కూర్చోబెట్టారు. అలాగే అనకాపల్లిలోని ఓ గుడిలో మీటింగ్ పెట్టుకున్నారు, నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మాలకొండయ్య స్వామి ఆలయంలో, చిత్తూరులో ఎంపీడీవో ఆఫీసులో మీటింగ్ పెట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు టీడీపీ జెండాలు కట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీటింగ్స్ ఎలా పెట్టుకుంటారని అడుగుతున్నాం.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు కానీ..
గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మేం ప్రశ్నించినా ఇంకా ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటూనే ఉన్నారు. చిన్న తప్పు జరిగితే నిబంధనల పేరుతో ఇతర ఉద్యోగుల్ని ఇళ్లకు పంపేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగుల్ని రాజకీయ పార్టీల సమావేశాల్లో వాడుకోవడం ఆపాలి. ఏ పార్టీతోనూ ఉద్యోగులకు సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వం చెప్పినట్లు నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందే. ఈ రెండేళ్లలో ఇచ్చిన హామీలు చెప్పడానికి పెట్టాల్సిన మహానాడుల్ని కాస్తా తమ విజనరీ లీడర్ గురించి చెప్పుకోవడానికే పెడుతున్నారు. 

మీరు అంత విజనరీ అయితే ఎన్నికల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు. మీరు నెరవేర్చలేనప్పుడు ఎందుకు ఆ హామీలు ఇచ్చారు ? అంటే ఉద్యోగులు, పెన్షనర్లను మీరు మోసం చేస్తున్నట్లే కదా. ఎంతో కాలం ఇలా వారిని మోసం చేయలేరు. వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్నారు, మంచి పీఆర్సీ ఇస్తామన్నారు. ఉన్న పీఆర్సీ కమిషనర్ నే రాజీనామా చేయించి ఇంటికి పంపారు. ఇప్పటికీ కొత్త పీఆర్సీ ఊసేలేదు. రెండేళ్లు కాలయాపన  జరిగినా ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఈ రెండేళ్లలో ఐదు డీఏలు పెండింగ్ లో ఉంటే, ఒక డీఏ మాత్రమే అరకొరగా ఇచ్చారు. డీఏ బకాయిలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నాం.

ప్రజలు లేరని ప్రభుత్వ ఉద్యోగులను తరలిస్తావా? చంద్రబాబు అసలు బాగోతం

40 వేల కోట్లకు చేరిన ఉద్యోగుల బకాయిలు
ప్రభుత్వం నుంచి జీపీఎఫ్ తో పాటు ఇతర బకాయిలు కలిపి రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. వీటిని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎంతసేపూ గతంలో ఉన్న ప్రభుత్వం తప్పుల గురించి మాట్లాడటమే కానీ మీరేం చేస్తారో చెప్పలేరా ? గత ప్రభుత్వం రాగానే రెండు నెలల్లో ఐఆర్ ఇచ్చింది. అలా మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దాదాపు 20 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్ని ఎందుకు క్రమబద్ధీకరించరు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ వాళ్లే ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకున్నారు. దాదాపు 7-8 వేల మంది లెక్చరర్లు ఇప్పటికీ క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అన్నారు. 

అందులో మేం కట్టిన డబ్బు ఎటు పోతుందో ఎవరికీ తెలియదు. ఆస్పత్రులకు సకాలంలో  ఆ డబ్బు కట్టకపోవడం వల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు ఉండాలని ఓ పథకం తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. అలాగని కొత్త పథకం కూడా అమలు చేయడం లేదు. ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల కోసం ఆప్కోస్ సంస్థ ఏర్పాటు చేస్తే, దాన్ని కూడా కాదని కావాల్సిన వాళ్లను రిక్రూట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఉద్యోగుల్ని ఘోరంగా వాడుకుంటున్నారు.జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకొచ్చారనే కోపంతో గార్డు, అటెండర్ చేసే పనుల్ని సైతం వెట్టిచాకిరీలా చేయిస్తున్నారు. ఏ సర్వే వచ్చినా వీళ్లకే చెప్తారు. వాళ్లకో జాబ్ చార్ట్ ఉండదు. నిన్న బక్రీద్ పండుగ వచ్చినా సెలవు ఇవ్వకుండా తిప్పారు.

ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తెచ్చిన జగన్
ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకుంటున్నారు. కానీ రేపు మరో ప్రభుత్వం వచ్చాక, గతంలో ఆ పార్టీ కార్యక్రమంలో కూర్చొన్నారని వీరిపై చర్యలు తీసుకుంటే, ఆ రోజు చంద్రబాబు వచ్చి కాపాడతారా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా లేని విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు మేలు చేస్తే.. తిరిగి దాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రబాబుకు ప్రైవేటీకరణ ముఖ్యమంత్రి అని ఓ బిరుదు ఇవ్చొచ్చు. ఏది కనిపిస్తే అది ప్రైవేటీకరణ చేసేస్తుంటారు. 

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే. ఆయన పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే దాన్ని రివర్స్ చేసే విధానం అమలు చేస్తున్నారు. ఇదేనా విజనరీ పాలన? రాబోయే రోజుల్లో ఇతర ప్రభుత్వ  విభాగాల్ని కూడా ఇలాగే ప్రైవేటీకరణ చేస్తారా ? ఉద్యోగుల్ని చిన్నచూపు చూడటం ఆపి, వారిని నిబంధనల ప్రకారం పనిచేసేలా ప్రోత్సహించాలి. పార్టీ కార్యక్రమాల్లో తిప్పుకోవడం ఇకనైనా ఆపాలని నలమారు చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement