
రైతుగోస ధర్నాలో మాట్లాడుతున్న షర్మిల
దమ్మపేట/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులను ఏ మాత్రం పట్టించుకోని సీఎం కేసీఆర్ దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, దాని కి చరమగీతం పాడాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధ వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కొనసాగింది. నాయుడుపేటలో రైతుగోస ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో దుర్మార్గులు రాజ్యమేలుతున్నారని, ఎస్సీ, ఎస్టీ రైతులను మను షులుగా గుర్తించడం లేదని ఆరోపించారు.
దివంగత మహానేత వైఎస్ తన హయాంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, రాయితీపై వ్యవసాయ యంత్రాలు అందించి వ్యవసాయాన్ని పండుగ చేశారని గుర్తు చేశారు. మిర్చి రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తానని సీఎం కేసీఆర్ మాట ఇచ్చి 6 నెలలు గడిచినా ఇప్పటికీ రూపాయి కూడా చెల్లించలేదన్నారు. యథా లీడర్ తథా కేడర్ అన్నట్టుగా కేసీఆర్ లాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ ఫామ్ హౌస్‌లలో భోగాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 7 గంటలకు కుదించడం ఏంటని ప్రశ్నించారు.
కేసీఆర్ మాట విని వరి సాగు చేయని రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే రైతుల సంక్షేమ పాలన తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. కాగా, తెలంగాణలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు షర్మి ల ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారం 1,000 కిలోమీటర్లకు చేరుకోనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొదలై నల్లగొండ జిల్లా మీదుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర ద్వారా ఆమె ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.