కేంద్రం వాటా... రాష్ట్రం వాటా ఎంతో చర్చిద్దామా?

Yendala Laxminarayana Reaction On Minister Harish Rao Challenge - Sakshi

సాక్షి, కరీంనగర్‌: మంత్రి హరీష్‌ రావు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, చర్చకు ఎక్కడికి రావాలో చెప్పాలంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీ నారాయణ చాలెంజ్‌ చేశారు. రేషన్ బియ్యం, అంగన్ వాడీ పౌష్టికాహారంలో కేంద్రం వాటా ఎంత.. రాష్ట్ర వాటా ఎంతో చర్చిద్దామా అంటూ ప్రశ్నలు సంధించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీష్‌ రావు, బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకుల గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజలను మభ్యపెట్టేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. (చదవండి: మంత్రి హరీశ్‌‌రావుకు డీకే అరుణ సవాల్)

అదే విధంగా, బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడంలేదుని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్‌ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన యెండల లక్ష్మీ నారాయణ.. కేంద్ర ఆవాసయోజన, కృషి వికాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారో చెప్పాలని హరీష్‌ను ప్రశ్నించారు.

‘‘క్రిష్ వికాస్ యోజన కింద కేంద్రం 850 కోట్ల రూపాయలిస్తే.. వాటిని ట్రాక్టర్ల రూపంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చిన వాటిపైన చర్చిద్దామా?. ప్రతి అంశంలో కేంద్రం వాటా ఏంటో చెప్పేందుకు నేను సిద్ధం, హరిష్ రావు సిద్ధమా? కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరాకు నీళ్ళు ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో హరీష్ రావు చెప్పాలి. గ్రామ పంచాయితీలకు 10 వేల ట్రాక్టర్ లు కొంటె అందులో ఎక్కువశాతం మహేంద్ర ట్రాక్టర్లు ఎందుకు ఉన్నాయో హరీష్ రావు చెప్పాలి’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘బీజేపి కార్పొరేటర్ ఎక్కడో ప్రెజెంటేషన్‌లో తప్పుదొర్లితే, దాన్ని పట్టుకుని రాష్ట్ర ఆర్ధిక మంత్రిగా హరీష్ రావు మాట్లాడమేమిటి.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సీఎం స్వంత జిల్లాలో సరైన గుణపాఠం ఎదురు కాబోతోంది’’ అని చురకలు అంటించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు సౌమ్యంగా.. కూల్‌గా సవాళ్లు విసిరారు.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనను చర్చకు రమ్మని ప్రతిసవాల్ విసురుతున్నా అని యెండల పేర్కొన్నారు.(చదవండిబీజేపీ దివాలాకోరు రాజకీయాలకు పరాకాష్ట)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top