బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? | Sakshi
Sakshi News home page

బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా?

Published Mon, Feb 20 2023 9:05 AM

Why Did Kanna Lakshminarayana Resign From Bjp - Sakshi

అద్దెకు వచ్చినవారు ఎప్పుడూ అదే అద్దె ఇంటిలో ఉంటారా? రాజకీయాలలో కూడా ఇలాగే అద్దె ఇళ్ల మాదిరి కొన్ని పార్టీలు ఉపయోగపడుతుంటాయి. బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అలాగే ఆ పార్టీని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఆయన కూడా కాంగ్రెస్‌లో ఉంటూ గ్రూపులు మార్చడంలో కాని, ఆ తర్వాత పార్టీలు మార్చడంలో కాని ఆరితేరినవారే.

తన అవసరార్ధం కన్నా బీజేపీలో చేరారు. ఆయనేదో రాష్ట్రం అంతటిని, కనీసం కాపు సామాజికవర్గంలో అయినా ప్రభావితం చేస్తారేమోనని ఆశపడి బీజేపీ భంగపడింది. చివరికి ఆయన తన దారి తాను చూసుకున్నారు. పోతూ, పోతూ బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుపై, పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులపై నాలుగు రాళ్లు వేసి వెళ్లారు. బీజేపీ అర్డెంట్‌గా జనసేనతో పాటు టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవాలన్నది ఆయన మనసులో మాట కావచ్చు. కాని అందుకు  పార్టీ అధిష్టానం ఇష్టపడడం లేదు.

బీజేపీని దారుణంగా మోసం చేసి, అవమానించిన చంద్రబాబుతో జతకట్టడానికి అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు ససేమిరా అంటున్నారు. మరోసారి ఎలాగోలా ఎమ్మెల్యేగా అయినా గెలవాలని తాపత్రయపడుతున్న కన్నా లక్ష్మీనారాయణ ,ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొత్త కూటమి ఏర్పడితే కాని అది సాధ్యం కాదని భావిస్తుండవచ్చు. కాకపోతే ఆ మాట చెప్పకుండా, బీజేపీ ఏదో అన్యాయం చేసినట్లు, తన వర్గంవారిని పదవుల నుంచి తొలగించడంపైన ఏవేవో ఆరోపణలు చేశారు. అది వేరే విషయం.

కన్నా చరిత్ర చూస్తే ఒకరకంగా అదృష్టవంతుడే అని చెప్పాలి. గతంలో కావూరి సాంబశివరావు, ఎన్.జి.రంగా వంటివారి ద్వారా తొలిసారి పెదకూరపాడు నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ పొందారు. అప్పట్లో ఆయన నేదురుమల్లి జనార్దనరెడ్డి వర్గానికి సన్నిహితం అయ్యారు. తొలుత చెన్నారెడ్డి క్యాబినెట్‌లో స్థానం దక్కలేదు. కాని నేదురుమల్లి మంత్రివర్గంలో స్థానం పొందారు. మొదటిసారే శాసనసభకు ఎన్నికైనా ఆయనకు ఈ అవకాశం రావడం అదృష్టమే.

ఆ తర్వాత నేదురుమల్లి కోటాలో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో కూడా కొనసాగారు. 1994,99, 2004 లలో కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఆయనకు పడేది కాదు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. కాని 2004 నాటికి వైఎస్ వర్గానికి దగ్గరయ్యారు. వైఎస్ క్యాబినెట్‌లో కూడా మంత్రి పదవి పొందారు. 2009లో నియోజకవర్గాల డిలిమిటేషన్ కారణంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారి మళ్లీ గెలిచారు. అప్పటికే సీనియర్ నేతగా గుర్తింపు పొంది తిరిగి వైఎస్ మంత్రివర్గంలో తన బెర్త్ తాను పొందారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత ఆయన మళ్లీ గ్రూపు మార్చుకున్నారు.

రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్‌లలో మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు రోశయ్యకు, కన్నాకు గుంటూరు రాజకీయాలలో పడేది కాదు. అది వేరే అంశం. రాష్ట్ర విభజన సమయంలో పీసీసీ అధ్యక్ష రేసులోకి వచ్చారు. సీఎం సీటుకు కూడా పోటీపడాలని ప్రయత్నించారు. కాని అవి దక్కలేదు. 2014లో ఆయన కాంగ్రెస్‌లోనే పోటీచేసి ఓడిపోయారు. గుంటూరు రాజకీయాలలో కన్నాకు పెద్ద ప్రత్యర్దిగా ఉన్న రాయపాటి సాంబశివరావు అప్పటికే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారి ఎంపిగా గెలిచారు. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉండడంతో రాయపాటి కేంద్రంలో కాని, రాష్ట్రంలో కాని  తన పలుకుబడి ఉపయోగించి ఎక్కడ తనను ఇబ్బంది పెడతారోనని సందేహించారు.

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వీరిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర అవినీతి ఆరోపణలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏమి చేయాలా అన్నదానిపై ఆలోచించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి రావడానికి  సన్నాహాలు చేసుకున్నారు. ఆయన ఇంటి వద్ద ఇందుకు సంబంధించి ప్లెక్సీలు కూడా వెలిశాయి. కాని సడన్‌గా అమిత్ షా పోన్ చేసి బీజేపీలో చేరాలని ఆహ్వానించారు.

వారి మధ్య అప్పుడు ఏమి జరిగిందో కాని, ఆయన వైసీపీలోకి వచ్చే ఆలోచన విరమించుకుని సాకు కోసం ఆస్పత్రిలో చేరారు. బీజేపీలోకి వెళితే సేఫ్ అని ఆయన నమ్మారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, కన్నాకు మధ్య ఉప్పు, నిప్పుగా పరిస్థితి ఉండేది. కన్నా స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వంగవీటి రంగాతో పాటు తనను కూడా హత్య చేయించడానికి చంద్రబాబు కుట్రలు చేశారని ఆరోపించారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని కన్నా బీజేపీలో చేరితే అక్కడ జాక్ పాట్ తగిలినట్లుగా ఆయన బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. దాంతో రాష్ట్ర స్థాయి ఎలివేషన్ బాగా వచ్చింది. 2019 లో నరసరావుపేట నుంచి లోక్ సభకు పోటీచేసి డిపాజిట్ పోగొట్టుకున్నారు.

ఆ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట వైసీపీకి చెందిన కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలే మెయిన్ టెయిన్ చేసినట్లు చెబుతారు. కాని తాను కోరిన కొన్ని పనులు జరగడం లేదని అసంతృప్తి ఉండేదట. దాంతో ఆయన క్రమంగా వైసీపీకి దూరంగా ఉండడం ఆరంభించారు. అంతలో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల బిల్లును తీసుకు రావడం, అమరావతి పేరుతో ఒక కృత్రిమ ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహించడం వంటి ఘట్టాలు జరిగాయి. ఈ అమరావతి వ్యవహారంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాస్త దగ్గరయ్యారు.

తిరుపతిలో జరిగిన ఒక సభలో చంద్రబాబుతో కలిసి చేతులు ఎత్తారు. ఇది ఒకరకంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గతంలో శాసనసభలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న వీరిద్దరూ ఇలా కలుస్తారని ఊహించగలరా? అంతేకాదు.. గతంలో టీడీపీలో ఉండి, తదుపరి బీజేపీలో చేరిన సుజనా చౌదరితో ఈయన సన్నిహితంగా కనిపించేవారు. అమరావతిలో ఏమైనా ప్రయోజనమో, లేక రాజకీయ బందమో తెలియదు కాని టీడీపీతో దగ్గరవుతున్న సంకేతాలు చాలాకాలంగా వస్తూనే ఉన్నాయి.

మరో విషయం ఏమిటంటే 2019లో పార్టీ పంపించిన డబ్బు పంపిణీలో కూడా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. బీజేపీ అధినాయకత్వానికి కన్నా పై క్రమేపి విశ్వాసం తగ్గింది. ఆ క్రమంలో ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినా, అది పెద్ద విషయం ఏమీ కాదనే చెప్పాలి. అయినా కన్నా బీజేపీపై కన్నా, పక్కచూపులే ఎక్కువగా చూస్తున్నారన్న ప్రచారం జరిగేది. దానికితోడు కన్నా తనతో పాటు జిల్లాల పార్టీ అధ్యక్షులు కొందరు తనకు సన్నిహితులైనవారిని కూడా బీజేపీ నుంచి బయటకు తీసుకువెళతారమోనన్న అనుమానంతో కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు వారిని తొలగించారు.

అది కన్నాకు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈలోగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈయనను కలిసి రాజకీయాలు చర్చించారు. జనసేనలోకి వచ్చి టీడీపీతో కలిసి పోటీ చేయాలని కన్నా భావించారు కాని, పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి వెనుకాడారట. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతను జనసేనలో చేర్చుకుంటే ఇబ్బంది వస్తుందన్నది ఆయన భావనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కన్నా బహుశా టీడీపీలో చేరడానికి మానసికంగా సన్నద్దమయ్యే బీజేపీని వీడారని భావిస్తున్నారు.

కన్నా అనుచరులు టీడీపీలోకి వెళదామని సూచించారట. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనలోకి వెళ్లవద్దని చెప్పారట. మరి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ ఇలా తన పార్టీలోకి వద్దామనుకున్నవారిని చేర్చుకుంటే ఎలా ఫీల్ అవుతారో తెలియదు. జనసేన కార్యకర్తలనే తీవ్రంగా అవమానించిన నటుడు బాలకృష్ణ ఎదుట కూర్చున్న వ్యక్తికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చేమో!. ఒకప్పుడు చంద్రబాబును తీవ్రంగా దూషించిన కన్నా ఇప్పుడు ఆయనలో తన భవిష్యత్తు చూసుకుంటున్నారట

దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి మరోసారి నిర్దారణ అవుతుంది. దీని వల్ల కన్నా లక్ష్మీనారాయణకు గౌరవం పెరుగుతుందని చెప్పలేకపోయినా, ఎన్నికల ఫలితాన్ని బట్టి చూసుకోవచ్చులే అని ఆయన సరిపెట్టుకుని ఉంటారు.అందుకే కన్నా అద్దె ఇంటి వంటి బీజేపీని ఖాళీ చేసి బయటకు వెళ్లిపోయారు. కాకపోతే కన్నాకు కొత్త ఇంటి కోసం వెదుకుతూ చివరికి తన ఒకప్పటి రాజకీయ శత్రువు ఇల్లే శరణ్యం అవడమే ఆయన దయనీయ స్థితికి అద్దం పడుతోందని అనుకోవచ్చు!
- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్

Advertisement
 
Advertisement