టీఎంసీతో కుంభకోణాలు!

Vote BJP for schemes TMC for scams Says Amit Shah - Sakshi

అధికారంలోకి వస్తే జంగిల్‌మహల్‌ బోర్డు ఏర్పాటు

బెంగాల్‌ ఆదివాసీలకు అమిత్‌షా హామీ

భాగ్‌ముండి: సర్వతోముఖాభివృద్ధి కావాలంటే ఎన్నికల్లో మోదీకి మద్దతునివ్వాలని బెంగాల్‌లోని ఆదివాసీలకు హోంమంత్రి అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. టీఎంసీ.. కుంభకోణాలు చేసిందన్నారు. బెంగాల్‌లో ఆదివాసీలు, కుర్మీ జాతి కోసం అభివృద్ది బోర్డును ఏర్పాటు చేస్తామని, ఉచిత విద్య కల్పించడంతో పాటు ఉపాధి కల్పన చేస్తామని హామీ ఇచ్చారు. టీఎంసీ ప్రభుత్వ హయంలో ఆదివాసీల హక్కులు, భూముల హరణ జరిగిందని, గిరిజనుల భూములను లాక్కొని చొరబాటుదారులకు కట్టబెట్టారన్నారు. ఒక ప్రత్యేక వర్గాన్ని సంతోష పరచడం కోసం బెంగాల్లో ఉర్దూను బోధనామాధ్యమంగా చేయాలని మమత కోరుకుంటోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన ఘోరంగా దెబ్బతిన్నదని, ఆటోమొబైల్‌ పరిశ్రమ ఎదగకుండా మమత అడ్డుపడ్డారని విమర్శించారు. ప్రజాపయోగ పథకాలు కావాలంటే బీజేపీకి ఓటేయాలని కోరారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన బీజేపీ కార్యకర్తల హత్యలకు కారకులైనవారంతా ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు.  

కుటుంబానికో ఉద్యోగం
టీఎంసీ ప్రభుత్వం ఆదివాసీలు, కుర్మీలు, బీసీలకు ఏమీ చేయలేదని, తాము అధికారంలోకి వస్తే ఈ వర్గాల్లో ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చారు. జంగిల్‌మహల్‌ బోర్డు ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జంగిల్‌మహల్‌ ప్రాంతంలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మమత రాజకీయాల కారణంగా మహిష్య, తెలి వంటి పలు వర్గాలు రిజర్వేషన్‌ కేటగిరీలోకి రాకుండా పోయాయన్నారు. ఇలా రిజర్వేషన్లు పొందలేని హిందూ బీసీ వర్గాలన్నింటినీ ఓబీసీల్లో చేరుస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే దుర్గాపూజ, సరస్వతి పూజను భయం లేకుండా జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే అక్రమ చొరబాట్లకు అడ్డుకట్టవేస్తామన్నారు. ఆదివాసీలకు స్థానిక భాషలోనే ఉచిత విద్య అందిస్తామని, ఉచిత స్థానిక రవాణా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో లెఫ్ట్, తర్వాత టీఎంసీలు ఆదివాసీలకు తీరని అన్యాయం చేశాయని దుయ్యబట్టారు. మోదీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని, కుంభకోణాలు కావాలంటే టీఎంసీకి ఓటేయాలని చెప్పారు. జంగిల్‌మహల్‌ ప్రాంతంలో తాగునీటి సమస్యను ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చాక రూ.10వేల కోట్లతో క్లీన్‌ వాటర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top