‘కారు’లోకి కీలక నేత.. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చేనా?

Venepalli Venkateswara Rao Joins TRS At Munugode - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు మంగళవారం టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమక్షంలో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు సమక్షంలో వేనేపల్లికి కేటీఆర్‌ పార్టీ కండువా కప్పారు. 

మునుగోడులో కీలక నేత వెంకటేశ్వర్‌రావు తొలుత టీడీపీలో, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి క్రియాశీలకంగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. 2018లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా బహిరంగ సభ పెట్టడంతో టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ అయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన వేనేపల్లి ఆగస్టులో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాజాగా అధికారికంగా తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరారు.  

బీజేపీ బలవంతంతోనే..
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి తనను బలవంతంగా బీజేపీలోకి తీసుకు వెళ్లారని, అక్కడికి వెళ్లాక మనోవేదనకు గురై తిరిగి సొంతగూటికి చేరుకున్నట్లు చండూరు జెడ్‌పీటీసీ కర్నాటి వెంకటేశం తెలిపారు. ఇటీవల బీజేపీలో చేరిన ఆయన మంగళవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. తాను ఏ పరిస్థితుల్లో బీజేపీలో చేరాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top