వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా? | VCK Chief On Dalit Tamil Nadu Chief Minister Comment | Sakshi
Sakshi News home page

వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?

May 12 2026 9:29 PM | Updated on May 12 2026 10:04 PM

 VCK Chief On Dalit Tamil Nadu Chief Minister Comment

చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్‌ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. 

టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు.

 “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.

ఎవరూ నన్ను సంప్రదించలేదు 
తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ,  డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. 

ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.

భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. 

కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement