
ఎవరైనా మామూలోడు ఈ మాటలు మాట్లాడితే చెప్పుతో కొట్టాలని అంటాం
బాధ్యత గల మంత్రి మాట్లాడితే ఏమనగలం?
పిచ్చివాడు మాట్లాడినట్టు అనుకోవాలే తప్ప..
చెన్నై రైల్వేస్టేషన్ 13 ఎకరాల్లో మాత్రమే ఉంది
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 16 ఎకరాల్లోనే ఉంది
రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, అమరావతి: అమరావతిలో రైల్వేస్టేషన్‌ను భారతదేశంలోనే అతి గొప్ప రైల్వేస్టేషన్‌గా 1,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రైతు నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషనా? ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు.
‘అత్యంత పురాతనమైన చెన్నై రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. కేవలం 13 ఎకరాలు, అదే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. 16 ఎకరాలు, బెజవాడ రైల్వేస్టేషన్ విస్తీర్ణం ఎంతో తెలుసా?.. కేవలం 8 ఎకరాల్లో ఉంది. అసలు 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెబుతుంటే వీళ్లను ఏమనాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. అదే మాట ఎవరైనా మామూలోడు మాట్లాడితే.. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడ్ని చెప్పుతీసి కొట్టాలని అంటాం. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం ఏమనగలం? అది పిచ్చివాడు మాట్లాడినట్టుగా అనుకోవాలే తప్ప అంతకు మించి వేరే భాష ఏం మాట్లాడగలం’ అని ఆయన వ్యాఖ్యానించారు.