కవిత పోటీ.. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌

TRS Operation Akarsh In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు 10 రోజులే గడువు ఉండటంతో జోరుగా ఆపరేషన్ ఆకర్ష్‌ను చేపడుతూ.. కారు దూకుడుగా వ్యవహరిస్తోంది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి కవిత ఓటమి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక ఎమ్మెల్యేలపై కేసీఆర్‌, కవిత, కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికను నేతలు సవాలుగా తీసుకున్నారు. జిల్లాలో పార్టీ పెద్దలైన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి, గంప గోవర్ధన్ కవితకు భారీ మెజార్టీ కట్టబెట్టే విధంగా చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ కార్పొరేషన్‌లో బీజేపీ చెందిన ఆరుగురు కార్పొరేటర్లు, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్‌ను టీఆర్‌ఎస్‌ గూటికి చేర్చుకున్నారు. (ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ : కవిత గెలుపు కసరత్తు)

జిల్లాలో బీజేపీకి ఉన్న ఇద్దరు జడ్పీటీసీల్లో ఒకరు ఇప్పటికే కారెక్కారు. మరికొంత మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌లోకి క్యూ కడుతున్నారు. ఇంకా పెద్ద ఎత్తున చేరుతారని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్‌కు ఇప్పటికే పూర్తి ఆధిక్యత ఉన్నా వలసలను ప్రోత్సహిస్తోంది. మొత్తం 824 మంది ప్రజా ప్రతినిధులలో సింహ భాగం 75 శాతం టీఆర్ఎస్‌కు చెందన వారే ఉన్నారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా బీజేపీ నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. గులాబీ నేతల ఎత్తులతో ఇతర పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. తమ ప్రజా ప్రతినిధులను కాపాడుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

మరోవైపు మొత్తం ఓటర్లలో 75 శాతం మంది టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే ఉన్నందున కవిత ఎన్నిక లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్‌ను అక్టోబర్‌ 9న నిర్వహించాలని ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top