అగ్నిపథ్‌కు షింజో అబే హత్యకు ముడిపెడుతూ కథనం.. బీజేపీ ఆగ్రహం

Trinamool Mouthpiece Link Shinzo Abe Assassination To Agnipath - Sakshi

కోల్‌కతా: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ పథకం అగ్నిపథ్‌కు ముడిపెడుతూ ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో విమర్శలకూ దారి తీసింది.

జపాన్‌ రాజకీయవేత్త షింజో అబేను హతమార్చిన వ్యక్తి పేరు టెత్సుయ యమగామి(41). జపాన్‌ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్‌ రాకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్‌ హాట్‌ చర్చకు దారి తీసింది. ఈ కథనాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఫ్రంట్‌పేజీ కథనంగా ప్రచురించింది ఇవాళ.

అంతేకాదు.. మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్‌, ఇతర రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్‌ నేత సురేంద్ర రాజ్‌పుత్‌ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్‌ చేశాడు. యమగామి జపాన్‌ ఎస్డీఎఫ్‌లో పని చేశాడు. కానీ, ఎలాంటి పెన్షన్‌ అతను పొందలేకపోయాడు అంటూ ట్వీట్‌ చేశాడాయన.  

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ నేత ట్వీట్‌తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగానే ఆ పత్రిక కథనాలు ప్రచురిస్తుంది. అసలు అగ్నిపథ్‌కు అబే మరణానికి మృతి పెట్టి కథనం రాసింది ఎవరు?. దేశం మీద గౌరవం, ప్రేమ ఉన్న ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. జాగో బంగ్లా చేసింది ముమ్మాటికీ తప్పే. భారత యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది టీఎంసీ. షింజో అబే మీద గౌరవంతో భారత్‌ సంతాప దినం పాటిస్తున్న వేళ.. ఇలాంటి కథనం దురదృష్టకరం అని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ విప్‌ మనోజ్‌ తిగ్గా ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: షింజో అబేపై కాల్పులకు అసలు కారణం ఇదే..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top