
సాక్షి, హైదరాబాద్: తనకు ఎటువంటి భేషజాలు లేవని, అందరితో కలిసి పనిచేస్తానని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం రాష్ట్ర ఇన్‌చార్జీ మాణిక్యం ఠాకూర్‌తో కలిసి గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అందరితో కలిసి పనిచేస్తానని డీసీసీ అధ్యక్షుల పని చేస్తేనే తాము పని చేసినట్లు అని అన్నారు. అందరం కలిసి కట్టుగా పని చేద్దామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఈనెల 12న అన్ని జిల్లాల్లో సైకిల్, ఎడ్లబండి ర్యాలీ చేపట్టాలని సూచించారు.
16న ఛలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలిపారు. అధికారంలోకి రావడం ఎలా అనేది ఆలోచన చేద్దామని, అందరం ఆ దిశగా పని చేద్దామన్నారు. డీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు ఎప్పుడూ స్వీకరిస్తామని తెలిపారు. మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. 16న ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని పార్టీ ఆదేశించినట్లు తెలిపారు. నిత్యం ప్రజల సమస్యలపై ఆందోళనలు చేయాలని ఆయన డీసీసీ అధ్యక్షుల సూచించారు.