
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.
ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.
మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్‌కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్‌కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది.