ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం: ఆర్‌.కృష్ణయ్య 

Telangana: MP R Krishnaiah Demand To Hike Students Scholarships - Sakshi

పంజగుట్ట (హైదరాబాద్‌): వచ్చే బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. కాలేజీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలన్నారు. సోమ వారం బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్‌ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీలో ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కో విద్యార్థికి రూ.20 వేల స్కాలర్‌షిప్, పాఠశాల విద్యార్థులకు రూ.15 వేలు, మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారని తెలిపారు. లోటుబడ్జెట్‌లో ఉన్న రాష్ట్రమే ఇస్తుండగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఎనిమిదేళ్లుగా 5.70 లక్షల మంది బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కరికీ మంజూరు చేయలేదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, విద్యార్థి  నాయకుడు జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top