
సాక్షి, హైదరాబాద్: గతంలో బీజేపీ ప్రకటించిన ‘ధరల విముక్త భారత్’ ఎప్పుడు సాధ్యమవుతుందని, ప్రధాని మోదీ ప్రకటించిన ‘అచ్ఛేదిన్’ ఎప్పుడు తెస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలన ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాని మోదీకి ఆమె 8 ప్రశ్నలు సంధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు సమాన ప్రాధాన్యం, జీడీపీలో తిరోగమనం, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఇతర నిత్యావసరాల ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించారు.
పెంచిన ధరల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.7 వేల కోట్ల పెండింగ్ నిధుల విడుదల ఎప్పుడని ప్రశ్నిస్తూ, నేర నియంత్రణతో పాటు అన్ని రకాల వైఫల్యాలను కవిత లేవనెత్తారు. పీఎమ్ కేర్స్ నిధుల గురించి దేశ ప్రజలకు కేంద్రం వాస్తవ సమాచారం వెల్లడించాలని కవిత డిమాండ్ చేశారు.