కాళేశ్వరానికి మీ సర్టిఫికెట్‌ అక్కర్లేదు 

Telangana Minister Niranjan Reddy Slams Congress And BJP Leaders - Sakshi

కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజం 

కేంద్ర జలవనరుల నిపుణులే ఇంజనీరింగ్‌ అద్భుతమన్న ప్రాజెక్టు ఇది 

ఎన్నడూ లేని వరదవల్లే ఈ విపత్తు  

కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన శ్రీశైలం రెండుసార్లు మునిగింది 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర జలవనరుల విభాగం నిపుణులే ఇంజనీరింగ్‌ అద్భుతంగా కొనియాడిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్, బీజేపీ నాయకుల సర్టిఫికెట్‌ అక్కరలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు నీళ్లుతాగి, పంటలు పండించుకుని.. లబ్ధిపొందిన ప్రజలే కాళేశ్వరానికి సర్టిఫికెట్‌ ఇస్తారని పేర్కొన్నారు.

ఆదివారం ఆయన బంజారాహిల్స్‌ మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎక్కడో నీటి లభ్యతలేని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ రీడిజైనింగ్‌ చేసి మేడిగడ్డకు మార్చారని చెప్పారు. అక్కడే ఇప్పుడు చూస్తున్న అద్భుతమైన ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌.. కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించడాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

సొంత రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ఇంత దుర్మార్గంగా ఈర్ష్యను ప్రదర్శించేవారు ఎవరూ ఉండరని, కాంగ్రెస్, బీజేపీ నేతల అక్కసుకు అవధులు లేవని మండిపడ్డారు. కాళేశ్వరానికి ఇప్పటి వరకు ఖర్చు చేసింది రూ.95 వేల కోట్లు అయితే రెండు లక్షల కోట్ల అవినీతి జరిగిందని నోటికొచ్చినట్లు మాట్లాడటం వారి తీరును తేటతెల్లం చేస్తోందన్నారు. 

ఎన్నడూ లేని వరద.. 
గోదావరికి ఎన్నడూ లేని రీతిలో వరదలు పోటెత్తడం వల్లనే ప్రాజెక్టులన్నీ నిండాయని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం కాళేశ్వరం వద్ద వరద నీటి మట్టం 103.5 మీటర్లు ఉంటే దానిని హెచ్చరికగా పరిగణిస్తారని, 104.75 మీటర్ల మట్టం వద్ద ప్రవహిస్తే డేంజర్‌ లెవెల్‌ దాటినట్లని తెలిపారు. 1986లో కాళేశ్వరం వద్ద నమోదు అయిన అత్యధిక వరద మట్టం 107.05 మీటర్లు కావడంతో, ఆ ఎత్తును దృష్టిలో పెట్టుకొనే పంప్‌ హౌస్‌లు నిర్మించారన్నారు.

కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 14వ తేదీన కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 108.19 మీటర్లు నమోదు అయిందని వివరించారు. గతంలో శ్రీశైలానికి 25 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కర్నూలునగరం మునిగిందని గుర్తు చేశారు. ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు తేడా తెలియకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన శ్రీశైలం 1998లో, 2009లో మునిగిందని, కల్వకుర్తి ఎత్తిపోతల రెండు సార్లు మునిగిందని తెలిపారు.

కాంగ్రెస్‌ కట్టిన జూరాల ప్రాజెక్టులో నీటిలభ్యత కేవలం ఆరు టీఎంసీలే కాబట్టి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో చేపట్టినట్లు తెలిపారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ఇచ్చిందని, రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలని పార్లమెంటులో డిమాండ్‌ చేయాలన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top